- బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నుంచి మేయర్ పీఠాన్ని ఆశిస్తున్న లీడర్లకు సవాళ్లు
- సొంత డివిజన్లలో ఎదురుగాలి
- తలనొప్పిగా మారిన నాన్ లోకల్ సెంటిమెంట్
కరీంనగర్/ కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో వివిధ పార్టీల నుంచి మేయర్ పీఠం ఆశిస్తున్న ఆశావహులు గెలుపు కోసం ఎదురీదుతున్నారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లో ఆర్థికంగా, పార్టీపరంగా బలమైన లీడర్లుగా పేరున్న వారు ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. గెలిస్తే పార్టీ తరపున మేయర్ అభ్యర్థిని తానే అని ప్రచారం చేసుకుంటున్నా, క్షేత్ర స్థాయిలో సవాళ్లు తప్పడం లేదు. ప్రత్యర్థులు కూడా వారి స్థాయిలోనే ప్రచారం చేస్తుండడం, ఓటర్లను సంతృప్తిపరిచేలా మర్యాదలు చేస్తుండడంతో గెలుపు విషయంలో వారు ఆందోళనకు గురవుతున్నారు.
బీఆర్ఎస్ నుంచి మేయర్ పీఠాన్ని ఆశిస్తున్న నూతి చంద్రయ్య 2వ డివిజన్ నుంచి పోటీ చేస్తుండగా, తాజా మాజీ కార్పొరేటర్, బీజేపీ అభ్యర్థి కొలగాణి శ్రీనివాస్ గట్టి పోటీ ఇస్తున్నారు. శ్రీనివాస్ సిట్టింగ్ కార్పొరేటర్ కావడం, చంద్రయ్య ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వ్యక్తి కావడంతో లోకల్, నాన్ లోకల్ సెంటిమెంట్ చంద్రయ్యకు ఇబ్బందికరంగా మారింది. ఆ డివిజన్ లో టికెట్ రాలేదని దాసరి సాగర్ లాంటి కీలక నాయకుడు బీఆర్ఎస్ ను వీడి రెబల్ గా పోటీలో నిలవడం ఆయనకు తలనొప్పిగా మారింది.
బీజేపీ నుంచి మేయర్ కుర్చీని ఆశిస్తున్న మాజీ మేయర్ డి.శంకర్ కు పోటీగా సిట్టింగ్ బీఆర్ఎస్ కార్పొరేటర్ మర్రి భావన భర్త మర్రి సతీశ్బరిలో ఉన్నాడు. డి.శంకర్ గత పదేళ్లు ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోవడం బలహీనతగా మారింది. కాంగ్రెస్ నుంచి మాజీ కార్పొరేటర్ కోడూరి రవీందర్ గౌడ్ తో పాటు ఇండిపెండెంట్ గా బరిలో దిగిన సౌగాని కొమురయ్య బలంగా పోటీ ఇస్తున్నారు. సౌగాణి కొమురయ్య టికెట్ ఇస్తామని రాజకీయాల్లోకి తీసుకొచ్చి, తీరా టిక్కెట్ ఇవ్వలేదనే చర్చ డివిజన్ లో ఉంది.
బీఆర్ఎస్ నుంచి మేయర్ సీటును ఆశిస్తున్న బీఆర్‌ఎస్ సిటీ ప్రెసిడెంట్, మాజీ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి భర్త చల్లా హరిశంకర్ కు బీజేపి సిట్టింగ్ అభ్యర్థి కొండపల్లి సరిత భర్త సతీశ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి వరాల నర్సింగం ప్రత్యర్థులుగా ఉన్నారు. అయితే హరిశంకర్ స్థానికేతరుడు కావడంతో ప్రత్యర్థులు లోకల్, నాన్ లోకల్ సెంటిమెంట్ ను రెచ్చగొడుతున్నారు. ఇది ఆయనకు ప్రతిబంధకంగా మారింది.
కాంగ్రెస్ నుంచి మేయర్ కుర్చీపై కన్నేసిన కరీంనగర్ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వైద్యుల అంజన్ కుమార్ 26వ డివిజన్ నుంచి పోటీలో ఉన్నారు. ఆయకు బీజేపీ అభ్యర్థి డాక్టర్ పుల్లెల పవన్ కుమార్ తో పోటీ తీవ్రంగా ఉంది. పుల్లెల పవన్ కుమార్ స్వతహాగా డాక్టర్ కావడంతో ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే అంజన్ కుమార్ భార్య గత ఎన్నికల్లో కార్పొరేటర్ గా ఓడిపోవడంతో ఆయనపై ప్రజల్లో సానుభూతి ఉంది.
46వ డివిజన్ నుంచి కాంగ్రెస్ తరపున మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్లికార్జున రాజేందర్ కు సిట్టింగ్ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ తో పోటీ నువ్వా, నేనా అన్నట్లుగా ఉంది. శ్రీకాంత్ సిట్టింగ్ కార్పొరేటర్ కావడం, యూత్, ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా ఒకే సామాజిక వర్గం కావడంతో ఓటర్లను తమ వైపు తిప్పుకోవడం అంత ఈజీ కాదని అంటున్నారు.
58వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న రవీందర్ సింగ్(బీఆర్ఎస్)పై బీజేపీ నుంచి బల్బీర్ సింగ్, కాంగ్రెస్ నుంచి ధన్నసింగ్ సైతం ఒకే సామాజిక వర్గం నుంచి బరిలో ఉండడంతో గెలుపు అంత ఈజీ కాదని అంటున్నారు. బీఆర్ఎస్ లో పని చేసి ఇండిపెండెంట్ గా బరిలో ఉన్న దుడ్డెల శ్రీధర్ సైతం పోటీలో ఉండడంతో గెలవడం అంత ఈజీ కాదని చెబుతున్నారు.
66వ డివిజన్ నుంచి మేయర్ అభ్యర్థిగా బరిలో ఉన్న మాచర్ల ప్రసాద్ కు సిట్టింగ్ కార్పొరేటర్ వంగల శ్రీదేవి భర్త వంగల పవన్ కుమార్(బీజేపీ)తో పోటీ తీవ్రంగా ఉంది.
బీజేపీ నుంచి మేయర్ సీటు ఆశిస్తున్న వాసాల రమేశ్ కొత్తపల్లి 18వ డివిజన్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాడు. 40 ఏళ్లుగా ఎన్నిక ఏదైనా ఓటమి ఎరుగని నేతగా రమేశ్ కు పేరుంది. ప్రస్తుతం ఆయన ప్రత్యర్థులిద్దరూ బలంగా ఉండడంతో ప్రతికూలంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థి చిలుక హన్మంతరెడ్డి ఉమ్మడి కరీంనగర్ రూరల్ మండలానికి ఎంపీపీగా పని చేశారు. తన డివిజన్ లో ఆయన సామాజిక వర్గం ఓట్లే గెలుపోటములను డిసైడ్ చేయనున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి జమీలుద్దీన్ తమ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులు, ప్రజల్లో ఆయనకు సొంతంగా ఉన్న పరపతిని నమ్ముకొని ముందుకుసాగుతున్నారు.
