- బ్యాక్ లాగ్ పోస్టులు బ్యాక్ డోర్లో భర్తీ చేసే ప్రయత్నం: కవిత
- మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ శాఖల్లో దొడ్డిదారిన ఉద్యోగాలు
- మెరిట్ స్టూడెంట్స్ కు తెలంగాణ జాగృతి అండగా ఉంటదని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: ‘‘తెలంగాణ వస్తే కొలువులు వస్తాయని యువత కలలు గన్నది. కాంగ్రెస్ వస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తదని నమ్మి ఓట్లేసింది. కానీ, ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నిరుద్యోగుల నోట్లో మట్టికొట్టే పని చేస్తోంది. మెరిట్ ను పక్కనబెట్టి.. బ్యాక్ లాగ్ పోస్టుల పేరుతో దొడ్డిదారిన రిక్రూట్ మెంట్లు చేస్తోంది’’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ శాఖల్లోని పోస్టులను అక్రమంగా భర్తీ చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల నుంచి వచ్చిన నిరుద్యోగులు తనను కలిసి గోడు వెళ్లబోసుకున్నారని, ఈ దొంగచాటు నియామకాలను తక్షణం ఆపాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం కొట్లాడిన యువత.. రాష్ట్రం వచ్చాక చిన్న చిన్న ఉద్యోగాలతో సరిపెట్టుకుందని కవిత గుర్తుచేశారు.
గతంలో సరిగ్గా పరీక్షలు నిర్వహించలేదని, బీఆర్ఎస్ను గద్దె దించితేనే తమకు న్యాయం జరుగుతుందని యువత భావించిందని.. అందుకే గ్రామాల్లో తిరిగి మరీ కాంగ్రెస్ కు ఓట్లు వేయించారని అన్నారు. ‘‘అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నరు. కానీ, ఇప్పటి వరకు ఏ నెలలో ఏ జాబ్ వస్తుందో క్లారిటీ లేదు. వేల రూపాయలు ఖర్చు పెట్టి సిటీలో కోచింగ్ తీసుకుంటున్న నిరుద్యోగులను ప్రభుత్వం నిండా ముంచుతోంది’’ అని కవిత ధ్వజమెత్తారు.
రేట్లు కట్టి అమ్ముకుంటున్నరు..
ట్రాన్స్ కో, జెన్ కో, ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్ పోస్టుల భర్తీలో భారీ స్కామ్ జరుగుతోందని కవిత ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దక్కాల్సిన బ్యాక్ లాగ్ పోస్టులను రాజకీయ నాయకులు, అవినీతి అధికారులు కుమ్మక్కై అమ్ముకుంటున్నారని ఫైర్ అయ్యారు. ‘‘గతంలో నిర్మల్లో 44 పోస్టులను రూ.10 లక్షల నుంచి 15 లక్షలకు అమ్ముకున్నట్టు ఆరోపణలు వచ్చాయి.
అప్పట్లో బీఆర్ఎస్ లో ఉండి అక్రమాలకు పాల్పడ్డ నాయకులే ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకొని న్యాయం జరగకుండా అడ్డుపడుతున్నరు’’ అని పేర్కొన్నారు. బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీలో జిల్లా కలెక్టర్లు జోక్యం చేసుకోవాలని, కేవలం మెరిట్ ఉన్న అభ్యర్థులకే ఉద్యోగాలు దక్కేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
అడ్డదారిలో డబ్బులిచ్చి ఉద్యోగాలు తెచ్చుకోవాలని చూస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ‘‘దేవుడి దయతో మేం మళ్లీ అధికారంలోకి వస్తాం.. అప్పుడు డబ్బులు ఇచ్చి జాబ్ కొట్టిన వాళ్లను, లంచం తీసుకున్న వాళ్లను కఠినంగా శిక్షిస్తాం’’ అని వార్నింగ్ ఇచ్చారు. ఈ అక్రమ నియామకాలపై ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టి విచారణ జరిపించాలన్నారు. మెరిట్ ఉన్న వారికి జాగృతి ఎప్పుడూ అండగా ఉంటుందని కవిత స్పష్టం చేశారు.
