వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై కన్నేసిన బీజేపీ ఇందుకు లోకల్‌బాడీ ఎన్నికలను ఆసరా చేసుకోవాలని భావిస్తోంది. ఇన్నాళ్లూ పట్టణాలకే పరిమితమైనందున పంచాయతీ ఎన్నికల ద్వారా పల్లెల్లోనూ పట్టు సాధించాలని యోచిస్తోంది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లా ల్లో మెజారిటీ పంచాయతీలు తమ ఖాతాలో వేసుకునే లక్ష్యంతో ముందుకు కదులుతోంది.
పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ లోని గ్రామాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఆ ప్రాంతాల్లో అత్యధిక సర్పంచ్స్థానాలను గెలిపించుకొని రావాల్సిన బాధ్యతలను ప్రజాప్రతినిధులకే అప్పగించింది. సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయిన మరుసటి రోజే బీజేపీ ఎన్నికల కమిటీ ముఖ్యుల సమావేశాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు నిర్వహించి, ఈ మేరకు దిశానిర్దేశం చేశారు.
బుధవారం ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, జిల్లా అధ్యక్షులతో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాంచందర్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గతంలో స్థానిక ఎన్నికలను నిర్లక్ష్యం చేశామని, ఈసారి సాధ్యమైనన్నీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి కాషాయ జెండా ఎగరయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
