మా వెనుక బీజేపీ లేదు

 మా వెనుక బీజేపీ లేదు

16 మంది రెబల్ ఎమ్మెల్యేలపై మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ శనివారం అనర్హత నోటీసులు జారీ చేశారు. ఈనేపథ్యంలో ‘ఏఎన్ఐ’ వార్తా సంస్థ గౌహతి (అస్సాం) రెబల్ క్యాంపులో ఉన్న శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే దీపక్ కేసర్కర్ తో మాట్లాడింది. ఈసందర్భంగా ఆయన  కీలక  వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు దీపక్ మాటల్లోనే.. 

పార్టీని వదల్లేదు.. వర్గాన్నే వేరు చేసుకున్నాం

‘‘మేం ఇంకా శివసేనలోనే ఉన్నాం. పార్టీని వదల్లేదు.  మా వర్గాన్ని పార్టీ నుంచి వేరు చేసుకున్నాం అంతే. మా రెబల్స్ గ్రూపునకు.. శివసేనలోని మూడింట రెండోవంతు (మెజారిటీ) ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది. మేమంతా కలిసి కొత్త నాయకున్ని  ఎంపిక చేసుకుంటాం. ఉద్ధవ్ థాక్రే దగ్గర 16, 17 మందికి మించి ఎమ్మెల్యేలు లేరు’’ అని ఎమ్మెల్యే దీపక్ కేసర్కర్ పేర్కొన్నారు. 

ఎన్నికల నాటి పంథానే.. ఇప్పుడూ అనుసరించాలి

‘‘మా రెబల్స్ వర్గానికి గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అది జరగకుంటే.. మేం మా గుర్తింపును నిరూపించుకునేందుకు కోర్టుకు వెళ్తాం. మా వద్ద సంఖ్యా బలం ఉంది. ఇప్పటికీ మేం సీఎం ఉద్ధవ్ థాక్రేను గౌరవిస్తున్నాం. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పంథాలో పోటీ చేశామో.. అదే పంథాలో ఇప్పుడూ శివసేన నడవాలనేది మా ఆకాంక్ష’’ అని ఆయన చెప్పారు. 

మా ఖర్చులను ఏ పార్టీ చెల్లించడం లేదు

‘‘ మా రెబల్ క్యాంప్ ఖర్చులను ఏ పార్టీ కూడా చెల్లించడం లేదు. మా నాయకుడు ఏక్ నాథ్ షిండే పిలుపుమేరకు మేం గౌహతి హోటల్ కు వచ్చాం. ఇక్కడ ఉంటున్నాం. మేమే ఎవరికి వారుగా ఖర్చులను భరిస్తాం. దీని వెనుక బీజేపీ లేనే లేదు’’