
- రెండ్రోజుల క్రితమే పార్లమెంటరీ కమిటీ సమావేశం
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని బరిలో నిలపాలని బీజేపీ భావిస్తున్నది. బలమైన బీసీ అభ్యర్థి కోసం వేట మొదలుపెట్టింది. అందుకే అభ్యర్థి ప్రకటన ఆలస్యమవుతున్నట్లు తెలిసింది. క్యాండిడేట్ ఎంపిక కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఇటీవల త్రిసభ్య కమిటీ వేసిన సంగతి తెలిసిందే. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆ కమిటీ మూడు పేర్లను సిఫార్సు చేయగా, రాంచందర్‌రావు ఆ లిస్టుతో ఢిల్లీ వెళ్లారు.
కానీ ఆ పేర్లను చూసి రాష్ట్ర నాయకత్వంపై హైకమాండ్ సీరియస్ అయినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఓ వైపు బీసీ రిజర్వేషన్లపై సీరియస్‌గా చర్చ జరుగుతుండడం, అధికారపార్టీ కాంగ్రెస్ బీసీ అభ్యర్థికి టికెట్ఇచ్చిన నేపథ్యంలో.. బీజేపీ నుంచి కూడా బీసీ అభ్యర్థిని రంగంలో నిలపాలని ఆదేశించినట్టు సమాచారం. దీంతో రాంచందర్‌రావు ఉత్త చేతులతోనే తిరిగివచ్చినట్లు ఆ పార్టీలో చర్చ నడుస్తున్నది.
బీసీ అభ్యర్థి కోసం గాలింపు..
రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం బీసీ గాలి వీస్తున్నది. లోకల్ బాడీ ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్ర సర్కారు తెచ్చిన బిల్లులు రాష్ట్రపతి వద్ద, పంచాయతీరాజ్చట్ట సవరణ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్ పడ్డాయి. ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడంతో బీసీ సంఘాలన్నీ బీజేపీ తీరును ఎండగడ్తున్నాయి. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బలమైన బీసీ అభ్యర్థికి టికెట్ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ తాను బీసీ పక్షపాతినని చాటిచెప్పింది. కానీ.. బీజేపీ రాష్ట్ర నాయకత్వం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన దీపక్‌రెడ్డి, కీర్తిరెడ్డి పేర్లతో ఢిల్లీకి వెళ్లడంతో హైకమాండ్.. క్లాస్ ఇచ్చినట్టు తెలిసింది.
పలు పేర్లు పరిశీలన..
జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో బీజేపీ నుంచి బరిలో నిలిపేందుకు బలమైన బీసీ నేతల కోసం ఆ పార్టీ నేతలు జల్లెడపడ్తున్నారు. ఆ పార్టీ యువ నేత విక్రమ్‌గౌడ్ సహా పలువురి పేర్లను పరిశీలిస్తున్నారు. వీరంతా బలమైన నేతలు కాకపోవడంతో ఇతర పార్టీలోని బీసీ నేతలను, ముఖ్యంగా టికెట్ దక్కని అసంతృప్తుల కోసం ప్రయత్నిస్తున్నారు. మరోవైపు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా.. ఇంతవరకూ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో పార్టీ లీడర్లు, కేడర్నారాజ్గా ఉన్నది. కాగా, మంగళవారం మధ్యాహ్నం కల్లా అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత ‘వెలుగు’కు తెలిపారు.