- భైంసాలో గెలుపు చరిత్రాత్మకం.. అహంకారుల కోట బద్దలుకొట్టాం
- కుటుంబ పార్టీలకు సిద్ధాంతాలు ఉండవు.. బీజేపీకి బలం కార్యకర్తలేనని కామెంట్
- స్టేట్ ఆఫీసులో ఘనంగా ‘దీన్ దయాళ్’ శిక్షణ మహాభియాన్ : రాంచందర్‌రావు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ గడ్డపై బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదిగిందని, రాష్ట్రంలో బీజేపీనే ఏకైక ప్రత్యామ్నాయం అనే విశ్వాసం ప్రజల్లో బలంగా నాటుకుపోయిందని బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు పేర్కొన్నారు. మున్సిపల్ ఫలితాలు కేవలం అంకెలు మాత్రమే కాదని, రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి అనుకూలమైన రాజకీయ వాతావరణాన్ని నిర్మించడంలో కార్యకర్తలు సాధించిన అసలైన విజయం అని తెలిపారు.
మంగళవారం హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో ‘పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహాభియాన్- 2026’ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్‌ను రాంచందర్ రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల్లోనే కాదు, స్వయంగా కార్యకర్తల్లోనూ తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయం అనే ఆత్మవిశ్వాసం, ధీమా గణనీయంగా పెరిగిందన్నారు. పోలింగ్ బూత్ స్థాయినుంచి జాతీయస్థాయి వరకు ప్రతి కార్యకర్తను సిద్ధాంతపరంగా, రాజకీయంగా, సంస్థాగతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ మహాభియాన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అహంకారుల కోటలు బద్ధలయ్యాయి.
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు బీజేపీ ఎదుగుదలకు నిదర్శనమని రాంచందర్‌రావు పేర్కొన్నారు. దేశమంతా ఫోకస్ అయిన భైంసాలో ఇన్నాళ్లూ ‘ఇది మా గడ్డ’ అని అన్నవారి అహంకారాన్ని బద్ధలుకొట్టి, అక్కడ కాషాయ జెండా ఎగురవేయడం చరిత్రాత్మక విజయమని చెప్పారు. ఇతర పార్టీలన్నీ కుటుంబ పార్టీలుగా మారిపోయాయని, వారికి సిద్ధాంతాలంటూ ఏమీ ఉండవని, అధికారమే వారి పరమావధి అని విమర్శించారు.
ప్రపంచంలోనే 14 కోట్ల సభ్యత్వంతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి కార్యకర్తలే వెన్నెముక అని, పార్టీలో ప్రతి ప్రక్రియ ప్రజాస్వామ్య పద్ధతిలోనే జరుగుతుందని పేర్కొన్నారు. కేరళలాంటి రాష్ట్రాల్లో కమ్యూనిస్టుల దాడులు, హత్యలు జరిగినా బీజేపీ కార్యకర్తలు వెనకడుగు వేయలేదని, ఆ త్యాగాల పునాదుల పైనే నేడు పార్టీ ఈ స్థాయికి చేరిందని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, రాష్ట్ర ఇన్‌చార్జి అభయ్ పాటిల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గౌతంరావు, వీరేందర్‌గౌడ్, వేముల అశోక్, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు,రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్‌చార్జీలు పాల్గొన్నారు.
ఓటు బ్యాంకు పెరిగింది: గౌతంరావు
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ అంతర్గతంగా కుమ్మక్కై పని చేయడం వల్లే తాము కచ్చితంగా గెల వాల్సిన స్థానాల్లో ఓటమి పాలయ్యామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.గౌతం రావు ఆరోపించారు. మంగళవారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీజేపీకి మంచి ఫలితాలు వచ్చాయని, ఓటింగ్ పర్సంటేజ్ గణనీయంగా పెరిగిందని చెప్పారు.
మున్సిపల్ ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రాబోయే రోజుల్లో పార్టీని ఎక్కడెక్కడ బలోపేతం చేయాలనేదానిపై వర్క్ షాపులో చర్చించామన్నారు. కాగా, బుధవారం సౌత్ ఇండియాస్థాయి శిక్షణ వర్క్‌షాప్ ఉంటుందని, దీనికి జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ హాజరవుతారని గౌతం రావు వెల్లడించారు. త్వరలోనే జిల్లా, మండల స్థాయిల్లోనూ శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు.
