రుణమాఫీ, పంట బీమా అమలు చేయాలి

రుణమాఫీ, పంట బీమా అమలు చేయాలి
  • రుణమాఫీ, పంట బీమా అమలు చేయాలని డిమాండ్​
  • బీజేపీ కిసాన్​మోర్చా ధర్నా
  • గోడలు, గేట్లు దూకి వ్యవసాయ కమిషనరేట్​ ముందు బైఠాయింపు

రైతులకు రూ.లక్ష రుణమాఫీ, కేంద్ర ప్రభుత్వ ఫసల్​ బీమా పథకాన్ని అమలు చేయాలన్న డిమాండ్​తో బీజేపీ కిసాన్​ మోర్చా చేపట్టిన వ్యవసాయ శాఖ కమిషనర్​ ఆఫీసు ముట్టడిని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. ముట్టడి కోసం ఎల్బీ స్టేడియానికి భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, రైతులను అక్కడే ఆపేశారు. వాళ్లెవరూ బయటకు రాకుండా స్టేడియం గేట్లు మూసి తాళాలేశారు. దీంతో పోలీసులు, కిసాన్​ మోర్చా నేతల మధ్య తోపులాట జరిగింది. కొందరు కార్యకర్తలకు గాయాలయ్యాయి. 
   
హైదరాబాద్, వెలుగు: రైతులకు రూ.లక్ష రుణమాఫీ, కేంద్ర ప్రభుత్వ ఫసల్​ బీమా పథకాన్ని అమలు చేయాలన్న డిమాండ్​తో బీజేపీ కిసాన్​ మోర్చా చేపట్టిన వ్యవసాయ శాఖ కమిషనర్​ ఆఫీసు ముట్టడిని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. ముట్టడి కోసం ఎల్బీ స్టేడియానికి తరలివచ్చిన కిసాన్​మోర్చా రాష్ట్ర ఇన్​చార్జి ప్రేమేందర్​రెడ్డి, కిసాన్​ మోర్చా ప్రెసిడెంట్​ శ్రీధర్​ ఆధ్వర్యంలోని పార్టీ కార్యకర్తలు, రైతులను అక్కడే ఆపేశారు. వాళ్లెవరూ బయటకు రాకుండా స్టేడియం గేట్లు మూసి తాళాలేశారు. దీంతో పోలీసులు, కిసాన్​ మోర్చా నేతల మధ్య తోపులాట జరిగింది. కొందరు కార్యకర్తలకు గాయాలయ్యాయి. అయితే కొందరు కార్యకర్తలు గేట్లు, గోడలు దూకి వ్యవసాయ శాఖ కమిషనర్​ ఆఫీసుకు చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. ఎల్బీ స్టేడియంలోని వారిని, కమిషనర్​ ఆఫీసుకు చేరుకున్న వారిని పోలీసులు అరెస్ట్​ చేశారు. పోలీసుల తీరుపై ప్రేమేందర్​ రెడ్డి మండిపడ్డారు. రైతు సమస్యలపై శాంతియుతంగా ధర్నా చేసేందుకు వచ్చిన తమను అక్రమంగా అరెస్ట్​ చేయడం దారుణమన్నారు. రైతుల సమస్యలపై పోరాటం చెయ్యనివ్వకుండా  పోలీసులను కేసీఆర్​ అడ్డం పెట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్​ ఉప ఎన్నిక కోసం కేసీఆర్​ మాయల మరాఠీ వేషాలేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ కార్పొరేషన్​కు బకాయి ఉన్న రూ.350 కోట్లే చెల్లించలేని సర్కార్​.. ఇప్పుడు దళితుల కోసం రూ.40 వేల కోట్లను ఖర్చు చేస్తామంటే ఎవరూ నమ్మే స్థితిలో లేరన్నారు. రైతులు, కిసాన్​ మోర్చా నేతల అరెస్ట్​పై బండి సంజయ్​ మండిపడ్డారు. పంట బీమా అమలు చేయాలని, రుణమాఫీ చేయాలని కోరడం నేరమా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్​ తియ్యటి మాటలు రైతుల కడుపులు నింపవన్నారు. రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు.