చీరలు పంచితే.. కవిత కట్టుకునే క్వాలిటీ చీరలు అడగండి

చీరలు పంచితే.. కవిత కట్టుకునే క్వాలిటీ చీరలు అడగండి

కరీంనగర్: టీఆర్ఎస్ నాయకులను ఇంకా కొనలేక.. వారి  కోసం ఖర్చు పెట్టలేక కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేలా చేశారని.. అందుకు ఆయనకు థ్యాంక్స్ అంటూ బొడిగే శోభ అన్నారు. టక్కుటమారా, గజకర్ణ, గోకర్ణ విద్యలు తెలిసినవాడు కేసీఆర్ అని ఆమె అన్నారు. బీజేపీ నేత ఈటల రాజేందర్ చేస్తున్న ‘ప్రజా దీవెన యాత్ర’ హుజూరాబాద్ మండలం సిర్సపల్లి గ్రామానికి చేరుకుంది. ఈ యాత్రలో ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యేలు బొడిగె శోభ, ధర్మారావు, జెడ్పీ మాజీ ఛైర్ పర్సన్ తుల ఉమ పాల్గొన్నారు. సిర్సపల్లి గ్రామస్తులు ఈటల రాజేందర్ కు బోనాలు, డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ మాట్లాడారు.

‘కుటుంబపాలనతో విసుగు చెందిన ప్రజలు 2023లో కేసీఆర్‎కు బుద్ది చెప్పాలని చూస్తున్నారు. దళితులకు ఇస్తానన్న పదిలక్షలు ఇవ్వకపోతే.. నీకు చావు డప్పు కొట్టి సమాధి చేస్తారు. జాగ్రత్త కేసీఆర్.. మీరు మాట తప్పితే.. అసెంబ్లీలో మిమ్మల్ని ఈటల నిలదీస్తారు. బీసీ బంధు కోసం కూడా అడుగుతారు. ఈటలను అసెంబ్లీకి పంపిస్తేనే కల్వకుంట్ల కుటుంబానికి బుద్ధి వస్తుంది. ఈటలను ఓడించాలని మీరు నాయకులను కొన్నారు కావచ్చు.. కానీ ప్రజలను కొనలేరు. కేసీఆర్ జేజెమ్మ వల్ల కూడా అది కాదు. టీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా బీజేపీకే ఓటువేయాలని చెబుతున్నారు. రేపటి నుంచి మీ దగ్గర చీరలు పంచుతారట.. మామూలు చీరలు తీసుకోకండి. ఎమ్మెల్సీ కవిత కట్టుకునే క్వాలిటీ చీరలు కావాలని కోరండి. లక్ష మెజార్టీ తగ్గకుండా ఈటల రాజేందర్‎ను గెలిపించాలి. ఈ పోటీ గెల్లు శ్రీనివాస్‎తో కాదు.. కేసీఆర్‎తో మాత్రమే. 
రూ. 10 లక్షల రూపాయలతో పాటు.. మూడెకరల భూమి సంగతేందని హరీశ్ రావును పిలిచి అడగండి. చింతమడకలో ఇచ్చినట్లు ఇక్కడ కూడా ఇవ్వాలని, ఇంటికో ఉద్యోగం ఏదని ప్రశ్నించండి’ అని శోభ అన్నారు.