సీఎంను కించపరిచారంటూ అర్ధరాత్రి అదుపులోకి..

సీఎంను కించపరిచారంటూ అర్ధరాత్రి అదుపులోకి..
  • కోర్టు బెయిల్ ఇవ్వడంతో విడుదల

హైదరాబాద్‌, వెలుగు: సీఎం కేసీఆర్‌‌ను కించపరిచేలా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఆరోపణలు చేశారంటూ బీజేపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ ‌పోలీసులు అరెస్ట్‌ చేశారు. గురువారం అర్ధరాత్రి ఘట్‌కేసర్‌‌ ఓఆర్‌‌ఆర్‌‌ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. మఫ్టీ డ్రెస్‌లో వచ్చిన పోలీసులు ఆయన కారును అడ్డుకుని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్టు చేశారు. హయత్‌ నగర్‌ స్టేషన్‌కు తరలించి.. శుక్రవారం ఉదయం రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రవేశపెట్టారు. బాలకృష్ణారెడ్డి తరఫున బీజేపీ లీగల్‌ సెల్‌ న్యాయవాదులు పీఠం ప్రదీప్‌, నరేశ్‌.. బెయిల్‌ పిటిషన్‌ ఫైల్‌ చేశారు. విచారణ జరిపిన కోర్టు.. బెయిల్ మంజారు చేసింది. తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్‌ని జిట్టా బాలకృష్ణారెడ్డి, రాణిరుద్రమరెడ్డి, ఎన్వీ సుభాష్ రెడ్డి, లంకల దీపక్ రెడ్డితో పాటు పలువురు నేతలు కలిశారు. 
అసలేం జరిగిందంటే..

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్‌ 2న రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌‌ మండలం తట్టిఅన్నారంలో ‘అమరుల యాదిలో ఉద్యమ ఆకాంక్షల సాధన సభ’ జరిగింది. జిట్టా బాలకృష్ణారెడ్డి, రాణి రుద్రమ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆత్మహత్యలు చేసుకున్న వారిని స్మరించుకున్నారు. ఈ క్రమంలోనే బొడ్డు ఎల్లన్న అలియాస్‌ దరువు యెల్లన్న, ఆయన బృందం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించింది.

అయితే సభలో విద్వేషాలు రెచ్చగొట్టేలా స్కిట్‌ వేశారని టీఆర్‌‌ఎస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌ వై.సతీశ్‌రెడ్డి ఈ నెల3న హయత్‌నగర్‌ ‌పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో సీఎంపై ఆరోపణలు చేశారని, ప్రభుత్వ పథకాలు, సీఎం కేసీఆర్‌‌ను కించపరిచేలా స్కిట్ వేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రిని మోసగాడిగా చిత్రీకరించారని అందులో పేర్కొన్నారు. దీంతో 505(2) ఐపీసీ సెక్షన్‌ కింద హయత్‌నగర్‌‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడి (ఏ1) గా బండి సంజయ్, ఏ2గా జిట్టా బాలకృష్ణారెడ్డి, ఏ3గా రాణిరుద్రమ, ఏ4గా దరువు ఎల్లయ్య పేర్లను పోలీసులు పేర్కొన్నారు.