కేటీఆర్‌‌కు బీజేపీ నేత కపిలవాయి రవీందర్‌‌ లేఖ

కేటీఆర్‌‌కు బీజేపీ నేత కపిలవాయి రవీందర్‌‌ లేఖ

హైదరాబాద్‌‌, వెలుగు: చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ విధించేందుకు జీఎస్టీ కౌన్సిల్‌‌ సమావేశంలో ఒప్పుకొని, ఇప్పుడు ప్రధానికి లేఖలు రాయడంలో అర్థమేమిటని బీజేపీ లిటరేచర్‌‌ కమిటీ చైర్మన్‌‌ కపిలవాయి రవీందర్‌‌ ప్రశ్నించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌‌కు రవీందర్ ఆదివారం లేఖ రాశారు. రూ.40 లక్షల వరకు విలువైన చేనేత ఉత్పత్తులపై పన్ను లేదని, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల లోపు ఉత్పత్తుల విక్రయాలపై జీఎస్టీ విధించేందుకు వెసులుబాటు కల్పిస్తే, తెలంగాణ ప్రభుత్వం రూ.20 లక్షల విలువైన ట్రాన్సాక్షన్లకే ఎందుకు జీఎస్టీ వేస్తోందని నిలదీశారు.

ఇలా రాష్ట్ర ప్రభుత్వం పన్నులు విధించడం నేతన్నలకు భారం కాదా అని ప్రశ్నించారు. ఈ పరిమితిని రూ.40 లక్షలకు పెంచితే మగ్గంపై నేసే వారిపై జీఎస్టీ పడే అవకాశమే ఉండదని, చేనేత ఉత్పత్తుల ట్రేడింగ్‌‌పై మాత్రమే జీఎస్టీ పడుతుందని తెలిపారు. గతంలో నూలుపై 10 శాతం సబ్సిడీ ఉండగా మోడీ ప్రభుత్వం దానిని 15 శాతానికి పెంచిందన్నారు. నేతన్నల కష్టాలకు రాష్ట్ర ప్రభుత్వం కారణమైతే మోడీ ప్రభుత్వాన్ని నిందించడం సమంజసం కాదన్నారు.