ఫోన్ ట్యాపింగ్ కేసులో సూత్రదారుల్ని అరెస్ట్ చేయాలి: లక్ష్మణ్

ఫోన్ ట్యాపింగ్ కేసులో సూత్రదారుల్ని అరెస్ట్ చేయాలి: లక్ష్మణ్

ఫోన్ ట్యాపింగ్ కేసులో దోషులకు శిక్ష పడే వరకు బీజేపీ పోరాటం చేస్తుందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్.  న్యాయ పోరాటానికి సైతం బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. ఇందిరాపార్క్ దగ్గర  ధర్నాలో మాట్లాడిన ఆయన..తెలంగాణ చరిత్రలో రేవంత్ రెడ్డి చరిత్రహిణుడిగా మిగిలిపోకుండా ఉండాలంటే ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి  అప్పగించాలన్నారు.  బీఎల్. సంతోష్ మీద కేసీఆర్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందన్నారు. లిక్కర్ కేసు నుంచి కవితను తప్పించడంకోసమే బీజేపీ నేతలపై కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. బీఆర్ఎస్ నేతలను ఏ మాత్రం కాపాడిన రేవంత్ రెడ్డికి కూడా అదే గతిపడుతుందని మండిపడ్డారు. 

 తెలంగాణలో కాంగ్రెస్ కంటే అత్యధిక ఎంపీ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు లక్ష్మణ్.  కేసీఆర్ అవినీతిని అసెంబ్లీ ఎన్నికల ముందు పదేపదే ప్రస్తావించిన రేవంత్ రెడ్డి...ఇపుడు ఎందుకు మౌనంగా ఉన్నారని  ప్రశ్నించారు. అధికారాన్ని శాశ్వత పరుచుకునేందుకు నిఘా వ్యవస్థను కేసీఅర్ దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు.  ఉప ఎన్నికల్లో ఓటర్లను కొనుగోలు చేయడానికి, ప్రత్యర్ధులను దెబ్బ కొట్టడానికి ఫోన్ ట్యాపింగ్ వాడారని ఆరోపించారు.  అరెస్ట్ అయిన వాళ్ళు వాంగ్మూలం ఇచ్చిన ఎందుకు అరెస్ట్ చేయడం లేదన్నారు. టెలికాం రెగ్యులేటరీకి భిన్నంగా, కేంద్రం అనుమతి లేకుండా  కేసీఆర్ ప్రభుత్వం  ఫోన్ ట్యాపింగ్ చేసిందన్నారు. తాను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడిని చెప్పుకున్న రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో  నిందితులను చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.