హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్‌పార్టీ అనుసరిస్తున్నది ఉత్తర కొరియా నియంత ‘కిమ్ జాంగ్ ఉన్’ ఐడియాలజీ అని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఎద్దేవా చేశారు. శనివారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి 70 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా కనీస హోం వర్క్ లేదనీ ఎగతాళి చేశారు. తన ముఖ్యమంత్రి సీటు కాపాడుకోవడమే తాపత్రయమని దుయ్యబట్టారు.
రాహుల్ గాంధీని పక్కన బెట్టి తనే నేషనల్ లీడర్ కావాలనే దురాశతో, తెలంగాణ ప్రజల సొమ్మును కేరళ ఎన్నికల ఫండింగ్ పేరుతో గాంధీ కుటుంబానికి కప్పం కడుతున్నారని ఆరోపించారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని సుభాష్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లోని కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్ చేసిన కుట్రల వల్లే అది జరిగిందన్నారు. తెలంగాణలోనూ ఖమ్మం, నల్గొండ బ్యాచ్‌లు రేవంత్‌ను గద్దె దించాలని చూస్తున్నాయని ఆయన జోస్యం చెప్పారు.
