
- ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి ఆయనే పంపిస్తున్నరు
- ఢిల్లీలోనే సీఎంకు క్యాంపు కార్యాలయం
హైదరాబాద్: కేసీఆర్ కనుసన్నల్లోనే ఆ పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపు జరుగుతున్నదని బీజేపీ నాయకుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. ఇవాళ పార్టీ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కేసీఆరే కాంగ్రెస్‌లోకి పంపిస్తున్నారని ఆరోపించారు. ఆరు నెలల్లో 11 సార్లు ఢిల్లీకి వెళ్లిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని విమర్శించారు.సీఎం ఢిల్లీలోనే క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారని సెటైర్ వేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అవుతున్నా పాలనపై సీఎం రేవంత్ పట్టు సాధించలేదన్నారు. ఆరు నెలల కాలంలో మూకుమ్ముడి బదిలీల పేరుతో ఐఏఎస్, ఐపీఎస్‌లను ట్రాన్స్ఫర్ చేశారన్నారు. బదిలీలతో అధికారులు శాఖలపై పట్టు సాధించలేకపోతున్నారన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు. హత్యలు, లైంగికదాడులు జరుగుతుంటే సమీక్షించే నాథుడే లేరని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం కొత్త ప్రయోగం చేస్తుందని విమర్శించారు. ఎమర్జెన్సీ విధించి 50ఏళ్లు అవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ బ్లాక్ డే నిర్వహిస్తుందని ఆయన పేర్కొన్నారు.