రాహుల్.. విదేశీ గడ్డపై దేశాన్ని విమర్శిస్తరా.?: సంబిత్ పాత్ర

రాహుల్.. విదేశీ గడ్డపై దేశాన్ని విమర్శిస్తరా.?: సంబిత్ పాత్ర

న్యూఢిల్లీ/రాంపూర్: ఇండియాలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందంటూ కేంబ్రిడ్జి వర్సిటీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఇండియాకు వ్యతిరేకంగా విదేశంలో వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించింది. ఇండియాను వర్ణించేందుకు ప్రపంచమంతా మంచి పదాలను ఉపయోగిస్తున్నది, కానీ దేశంలోని ప్రతిపక్ష నేతలు మాత్రం.. దేశాన్ని ధ్వంసంచేశారని, ప్రజాస్వామ్యంలేదని విదేశీ గడ్డపై మాట్లాడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర విమర్శించారు. ‘చైనాను కాదని ఇండియాకు విదేశీ కంపెనీలు క్యూ కడుతుంటే.. రాహుల్​ గాంధీ మాత్రం విదేశీ ఇన్వెస్టర్లను రాకుండా చేస్తున్నారు” అని ఆరోపించారు. ‘‘ఓ పెద్ద వర్సిటీలో.. ఇండియా గురించి ఆయన చెడుగా మాట్లాడారు. ఆఖరికి పాకిస్తాన్ కూడా ప్రపంచ వేదికపై భారత్​ గురించి ఇలా మాట్లాడే ధైర్యం చేయదు” అని మండిపడ్డారు.  దేశ ప్రతిష్టను తగ్గించేందుకు ఏదైనా ఏజెన్సీలో ఏజెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రాహుల్ పనిచేస్తున్నారా? అని ప్రశ్నించారు. దేశాన్ని నాశనం చేయడానికి ఆయన కుటుంబం ఎంతకైనా దిగజారవచ్చని అన్నారు. ‘‘మీరు మీ రాజవంశ పార్టీకి ప్రకాశవంతమైన పిల్లవాడు కానంత మాత్రాన.. భారత్​ ప్రకాశవంతమైన ప్రదేశం కాదని అర్థం కాదు” అని ఎద్దేవా చేశారు.

దేశంలో ఫెయిలైనోళ్లు.. నఖ్వీ

దేశంలో ఫెయిల్ అయిన వాళ్లు విదేశాల్లో గేమ్స్ ఆడుతున్నారంటూ రాహల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గాంధీని  బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ విమర్శించారు. ‘దేశంలో ఓడిపోయిన వారు తమ రాజవంశానికి వచ్చిన ప్రమాదాన్ని.. ప్రజాస్వామ్యానికి ముప్పుగా, ప్రజాస్వామ్య విధ్వంసంగా చిత్రీకరిస్తున్నారు’ అని మండిపడ్డారు.