ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ కోసం.. సెక్రటేరియెట్ ముట్టడి

ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ కోసం.. సెక్రటేరియెట్ ముట్టడి
  •     గేటు ముందు స్టూడెంట్ల సంతకాల లెటర్లు పోసి బీజేపీ నిరసన  
  •     రూ.15 వేల కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌‌‌‌ 
  •     రాంచందర్‌‌‌‌రావు, ఏలేటి, డీకే అరుణ సహా పలువురు నేతల అరెస్ట్‌‌‌‌


హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో పెండింగ్‌‌లో ఉన్న రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌‌ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం బీజేపీ తలపెట్టిన సెక్రటేరియెట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల నుంచి సేకరించిన సంతకాలతో కూడిన వినతిపత్రాలను ప్రభుత్వానికి అందజేసేందుకు వెళ్లిన బీజేపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సెక్రటేరియెట్ గేటు ముందే విద్యార్థుల సంతకాల ప్రతులను పోసి బీజేపీ నేతలు నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగి, ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో వారంతా గేటు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

ఈ ఆందోళనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌‌. రాంచందర్‌‌రావు, పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌‌ రెడ్డి, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్సీ మల్క కొమరయ్యతో సహా పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా రాంచందర్‌‌‌‌రావు మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌‌ నిధులు రాక రాష్ట్రంలో లక్షలాది మంది పేద విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అయిందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన 8 లక్షల మంది విద్యార్థుల సంతకాలతోకూడిన వినతిపత్రాలను వ్యక్తిగతంగా అందజేసేందుకు సమయం కేటాయించాలని కోరుతూ మూడు రోజుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్టు చెప్పారు. సీఎంఓ ఆఫీస్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో, లక్షలాది మంది విద్యార్థుల ఆవేదనను నేరుగా ప్రభుత్వానికి వినిపించేందుకు సెక్రటేరియెట్‌‌కు వచ్చినట్టు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది తనను కాదనీ, ఫీజు రీయింబర్స్‌‌మెంట్ కోసం నిరీక్షిస్తున్న 40 లక్షల మంది విద్యార్థుల గొంతును అరెస్ట్ చేసిందన్నారు. తాను ఇప్పటికే నిరాహార దీక్ష చేశానని, ముఖ్యమంత్రికి లేఖలు రాశానని, 8 లక్షల సంతకాలు సేకరించినా ఈ సిగ్గులేని ప్రభుత్వం ఇసుమంతైనా స్పందించకపోవడం అహంకారానికి నిదర్శనమన్నారు.  

నియంతృత్వ పాలనకు పరాకాష్ట: ఏలేటి 

బీజేపీ శాసనసభాపక్ష నేత హోదాలో ఉన్న తనను, తోటి నాయకులను పోలీసులు అమానుషంగా ఈడ్చుకుంటూ వెళ్లి అరెస్టు చేయడం రాష్ట్రంలో కొనసాగుతున్న నియంతృత్వ పాలనకు పరాకాష్ట అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు బకాయిలు అడిగితే పోలీసులతో అణచివేయడం అత్యంత హేయమైన చర్యని పేర్కొన్నారు. పోలీసుల నిర్బంధాలు, అక్రమ అరెస్టులకు భయపడి విద్యార్థుల పక్షాన పోరాటాన్ని ఆపేది లేదన్నారు. పెండింగ్‌‌లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని లేకపోతే ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు గౌతమ్ రావు, విజయలక్ష్మీ, గణేష్ తదితరులు పాల్గొన్నారు.