
- దాడులపై ఎంక్వైరీ చేయించండి
- సంజయ్ యాత్రను టీఆర్ఎస్ అడ్డుకుంటోంది
- గవర్నర్ కు బీజేపీ నేతల ఫిర్యాదు
- యాత్రకు సెక్యూరిటీ కల్పించేలా డీజీపీని ఆదేశించాలని వినతి
హైదరాబాద్, వెలుగు: బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను అనుమతించేలా, సెక్యూరిటీ కల్పించేలా డీజీపీని ఆదేశించాలని గవర్నర్ తమిళిసైని బీజేపీ నేతలు కోరారు. పార్టీ ఎంపీ లక్ష్మణ్ ఆధ్వర్యంలో మంగళవారం రాజ్ భవన్లో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ‘‘మంగళవారం జనగామ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్రపై దాడికి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కుట్ర పన్నారు. దాడికి 5 వేల మందిని సమీకరించారు. యాత్రకు వస్తున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. సంజయ్ ని అక్రమంగా అరెస్టు చేశారు. అలాగే లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత ఇంటి ముందట సోమవారం బీజేపీ కార్యకర్తలు ధర్నా చేయగా టీఆర్ఎస్ గూండాలు దాడి చేశారు.
మా పార్టీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. 26 మందిపై తప్పుడు కేసులు పెట్టారు. వారం కింద జనగామ జిల్లా దేవరుప్పులలోనూ యాత్రపై దాడి జరిగింది” అని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ 3 ఘటనలపై విచారణ జరిపించాలని కోరారు. ఆయా చోట్ల బీజేపీ నేతలపై దాడి జరిగినా పోలీసులు చర్యలు తీసుకోలేదన్నారు. దుండగులకే మద్దతుగా నిలిచారన్నారు. రెండో విడత పాదయాత్రప్పుడు గద్వాల జిల్లాలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడి చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. టీఆర్‌ఎస్ కంచుకోటలుగా భావిస్తున్న ప్రాంతాల్లో బీజేపీ యాత్రకు అపూర్వ స్పందన వస్తుండడంతో ఏదో ఒక సాకుతో యాత్రను అడ్డుకునేందుకు రాష్ట్ర సర్కార్ కుట్ర పన్నుతోందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. గవర్నర్ ను కలిసిన వారిలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే రఘునందన్ రావు, పార్టీ నేతలు డీకే అరుణ, విజయశాంతి, రాంచందర్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు.
కవిత.. వికెట్ పడ్తది: విజయశాంతి
లిక్కర్ స్కామ్ లో కవిత ఓపెనింగ్ వికెట్ పడబోతోందని విజయశాంతి అన్నారు. లిక్కర్ స్కామ్‌ను కప్పిపుచ్చుకునేందుకే టీఆర్ఎస్ వాళ్లు దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు.
టీఆర్ఎస్వి చిల్లర రాజకీయాలు: ఎంపీ లక్ష్మణ్
సంజయ్ యాత్రను అడ్డుకోవడం, ఆయనను అరెస్టు చేయడం టీఆర్ఎస్ సర్కార్ దిగజారుడుతనమేనని ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. టీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తోందన్నారు. గవర్నర్ తమిళిసైతో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సర్కారు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే పాదయాత్ర పై దాడికి చేశారన్నారు. పాదయాత్ర యథావిధిగా జరిగేలా చూడాలని, దాడి ఘటనలపై విచారణ జరపాలని గవర్నర్ ను కోరామని చెప్పారు.