
ముంబై: మనిషి సంఘ జీవి. ఒంటరిగా బతకలేడు. మనిషికి ఒంటరితనాన్ని మించిన నరకం మరొకటి ఉండదు. ఈ మాటలను పలు సందర్భాల్లో వినే ఉంటారు. కానీ.. ఈ సమాజంతో పనిలేకుండా, మనుషులతో కలవకుండా.. ఒక మనిషి ఒంటరిగా ఒకటి కాదు.. రెండు కాదు.. మూడేళ్లు నాలుగు గోడల మధ్య బతికాడంటే నమ్మగలరా..? నమ్మాలి.. నమ్మి తీరాలి. ఎక్కడో అడవులలోనో.. చెట్లలోనో.. గుట్టల్లోనో కాదు దేశ ఆర్థిక రాజధాని ముంబై మహా నగరంలో ఒక 55 ఏళ్ల వయసున్న వ్యక్తి మూడేళ్లు తన ఫ్లాట్ నుంచి బయటకు రాకుండా బతికాడు. మరి.. నీళ్లూతిండీ ఎలా అంటారా..? అన్నీ ఆన్లైన్లోనే ఆర్డర్ చేసేవాడు. మూడేళ్ల తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ మనిషి ఉదంతం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. నగరాల్లో మనుషుల బిజీ బతుకులు పక్క మనిషి ఉన్నాడా..? పోయాడా..? అని కూడా పట్టించుకోనంత దారుణంగా ఉన్నాయనే చేదు నిజాన్ని ఈ ఘటన కళ్లకు కట్టింది.
అసలు ఈ పెద్దాయన ఎవరంటే.. ముంబైలోని జుయినగర్కు చెందిన అనూప్ కుమార్ నాయర్ గతంలో కంప్యూటర్ ప్రోగ్రామర్‌గా పనిచేసేవాడు. ఆయన తల్లి పూనమ్మ నాయర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో టెలీ కమ్యూనికేషన్స్ విభాగంలో ఉద్యోగం చేసేవారు. అనూప్ తండ్రి వీపీ కుట్టి కృష్ణన్ నాయర్ ముంబైలోని టాటా హాస్పిటల్లో పనిచేసేవారు. ఆరేళ్ల క్రితం అనూప్ తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు. 20 ఏళ్ల క్రితం అనూప్ అన్నయ్య ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అనూప్ పెళ్లి చేసుకున్నాడా..? లేడా..? అనే విషయంలో స్పష్టత లేదు. ఇలా.. దురదృష్టవశాత్తూ అనూప్ తన కుటుంబం మొత్తాన్ని పోగొట్టుకుని ఒంటరిగా మిగిలిపోయాడు. ఒంటరితనం కారణంగా డిప్రెషన్ అతనిని వెంటాడింది. ఉద్యోగం పోయింది. 55 ఏళ్ల వయసున్న అనూప్ కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసినప్పటికీ ఎక్కడా అవకాశం దక్కలేదు.
ఈ పరిణామాలన్నీ అనూప్ నాయర్‌ను మరింత మానసిక ఒత్తిడిలోకి నెట్టేశాయి. ఎంతలా అంటే.. బయటికొచ్చి బతకలేనంతగా అనూప్ మానసిక స్థితి తయారైంది. మూడేళ్ల నుంచి ముంబైలోని తన సొంత ఫ్లాట్‌లో నాలుగు గోడల మధ్యనే అనూప్ మగ్గిపోయాడు. తిన్నావా..? ఉన్నావా..? అని పలకరించే నాథుడు లేక కుమిలికుమిలి నరకయాతన అనుభవించాడు. ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని తిన్నాడు. నీళ్లు కూడా అంతే. కుటుంబం మొత్తాన్ని కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయిన అనూప్ నాయర్ ను బంధువులు కనీసం పలకరించలేదు. చుట్టపు చూపు కూడా చూడలేదు.
దీంతో.. మూడేళ్ల నుంచి ఆ ఫ్లాట్‌లోని నాలుగు గోడలే అనూప్ ప్రపంచం. ఒక సామాజిక సేవా సంస్థకు అనూప్ పరిస్థితి గురించి తెలిసింది. ఆయనను మళ్లీ మామూలు మనిషిని చేసేందుకు సామాజిక సేవా సంస్థ Social Workers of Social and Evangelical Association for Love (SEAL) ముందుకొచ్చింది. ఆయనను ఆ ఫ్లాట్ నుంచి బయటకు తీసుకొచ్చి హెయిర్ కటింగ్, క్లీన్ షేవింగ్ చేసి ఆయనకు కౌన్సిలింగ్ ఇచ్చింది. ఇలా మెట్రో నగరాల్లో ఒంటరితనంతో కుమిలిపోతూ లాక్ చేసుకుని ఫ్లాట్లలో మగ్గిపోతున్న వాళ్లు చాలా మందే ఉన్నారని SEAL వ్యవస్థాపకుడు అబ్రహం మథాయి తెలిపారు.