ఎన్ హెచ్ 61 విస్తరణకు గ్రీన్ సిగ్నల్..ఖానాపూర్ నుంచి చెల్గల్ వరకు బైపాస్, టూ లేన్స్ హైవే

ఎన్ హెచ్ 61 విస్తరణకు గ్రీన్ సిగ్నల్..ఖానాపూర్ నుంచి చెల్గల్ వరకు బైపాస్, టూ లేన్స్ హైవే
  • 54 కిలోమీటర్ల రోడ్డుకు రూ.750 కోట్లు కేటాయింపు 
  • త్వరలో డీపీఆర్ తయారు
  • ఇప్పటికే కల్యాణ్ నుంచి నిర్మల్ మీదుగా ఖానాపూర్ వరకు పూర్తి

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన ఖానాపూర్ నుంచి జగిత్యాల జిల్లా చల్​గల్ వరకు నిర్మించనున్న నేషనల్ హైవే 61 విస్తరణ పనులకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖానాపూర్ నుంచి బాదనకుర్తి మీదుగా చల్​గల్ వరకు 54 కిలోమీటర్ల పొడవు  నిర్మించనున్న హైవే విస్తరణ పనుల కోసం మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్​పోర్ట్ అండ్ హైవేస్ (ఎంఓఆర్​టీహెచ్) రూ.750 కోట్లు కేటాయించింది. మహారాష్ట్రలోని కల్యాణ్ నుంచి మొదలయ్యే ఎన్​హెచ్​61 తెలంగాణలోని భైంసా, నిర్మల్, ఖానాపూర్ మీదుగా చల్​గల్ వరకు ఉంది.

ఇక్కడ నిజామాబాద్ నుంచి ఛత్తీస్​గఢ్​లోని జగదల్​పూర్ వరకు ఉన్న నేషనల్ హైవే 63కి ఇది లింక్​కానుంది. ఫలితంగా కల్యాణ్ నుంచి జగదల్​పూర్ వరకు ఈ హైవే పూర్తిస్థాయిలో ఏర్పడనుంది. ఇందుకు ప్రాథమిక సర్వే ద్వారా కేంద్రం తాజాగా నిధులు కేటాయించింది. ఖానాపూర్ నుంచి మొదలయ్యే విస్తరణ పనులు జిల్లాలోని బాదన్​కుర్తి మీదుగా జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్, ఇటిక్యాల, రాయికల్, చల్​గల్ వరకు చేపట్టనున్నారు.

త్వరలో డీపీఆర్ రూపకల్పన 

నిర్మల్ నుంచి ఖానాపూర్ వరకు దాదాపు 35 కిలోమీటర్ల పొడవుతో ఎన్​హెచ్​61 పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ రోడ్డుపై ఏడు చోట్ల అండర్ పాస్ పనులు చివరిదశకు చేరుకున్నాయి. ఇవి కంప్లీట్​అయిపోతే ఖానాపూర్ వరకు పనులు పూర్తయినట్లే. ఇక హైవే నిర్మాణానికి డీపీఆర్ రూపొందించాల్సి ఉంటుంది. డీపీఆర్​కు అనుమతులు లభించగానే సంబంధిత శాఖ భూసేకరణకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. నిర్మల్ జిల్లాలో ఏడు కిలోమీటర్లు, జగిత్యాల జిల్లాలో 47 కిలోమీటర్ల పొడవుతో భూములు సేకరించాల్సి ఉంటుంది. 

ఖానాపూర్ మీదుగా బాదన్​కుర్తి వరకు బైపాస్

ఈ రోడ్డు కోసం ఖానాపూర్ నుంచి బాదన్​కుర్తి వరకు బైపాస్ నిర్మించాలని ప్రతిపాదనలున్నాయి. ఖానాపూర్ పట్టణానికి సమీపంలోని సాయిబాబా ఆలయం వెనుక నుంచి మొత్తం 7 కిలోమీటర్ల పొడవుతో ఈ బైపాస్ నిర్మించనున్నారు. అయితే ఈ మార్గంలో అటవీ శాఖ భూములుండడంతో ఆ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి.

హైవే రోడ్డు అలైన్ మెంట్ చేయాల్సి ఉంది

ఖానాపూర్ నుంచి జగిత్యాల జిల్లా చల్​గల్ వరకు బైపాస్ తో పాటు టూ లేన్స్ హైవే పనులకు కేంద్రం నిధులు కేటాయించింది. నిర్మల్ జిల్లాలో ఏడు కిలోమీటర్ల పొడవున విస్తరించ నున్న రోడ్డు కోసం ఇప్పటికే ప్రాథమిక సర్వే చేపట్టాం. డీపీఆర్ కు అనుమతి లభించగానే భూసేకరణ ప్రక్రియ చేపడతాం.  - సుభాష్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్,  నేషనల్ హైవే (ఆర్ అండ్ బీ)  నిర్మల్