
మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటం
క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు: మంత్రి వివేక్
ప్రమాద స్థలం పరిశీలన
దవాఖానల్లో చికిత్స పొందుతున్నవారికి పరామర్శ
ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామన్న మంత్రి
యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడి
సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు వల్ల చనిపోయినవారి కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని రాష్ట్ర కార్మిక, మైనింగ్‌శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సోమవారం సిగాచి ఫార్మా ఇండస్ట్రీలో ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే.. మంత్రి వివేక్ వెంకటస్వామి అక్కడికి చేరుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామి మీడియాతో మాట్లాడారు. ప్రమాదంలో మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు, గాయపడిన కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్మికుల మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నందున డీఎన్‌ఏ టెస్టులు చేయించి, బంధువులకు అప్పగిస్తామని తెలిపారు. బ్లాస్టింగ్ వల్ల ఏర్పడిన శిథిలాలను తొలగించేందుకు హైదరాబాద్ నుంచి హైడ్రాకు చెందిన జేసీబీలు తెప్పించినట్లు వివరించారు.
వైద్య సేవలపై ఆరా
చందానగర్‌లోని అర్చన, బీరంగూడలోని పనేషియా, పటాన్‌చెరులోని ధ్రువ దవాఖానల్లో చికిత్స పొందుతు న్న క్షతగాత్రులను మంత్రి వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. ఈ సందర్భంగా క్షతగాత్రులకు అంది స్తున్న చికిత్స గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదని, కార్పొరేట్ హాస్పిటల్స్‌కు పంపించలేదంటూ హరీశ్‌రావు చేసిన ఆరోపణలను మంత్రి వివేక్ వద్ద మీడియా ప్రతినిధులు పస్తావించగా.. ఆయన కొట్టిపారేశారు. హరీశ్‌రావు ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ‘‘ఇలాంటి సంఘటల్లో బాధితులకు ఊపిరి తీసుకోవడంలో సమస్యలు తలెత్తుతాయి. డీ హైడ్రేషన్ ప్రాబ్లం ఉంటుంది. అందుకే వారిని దగ్గర ఉన్న ఆస్పత్రులకు పంపించి, మొదట ఆక్సిజన్ అందిస్తున్నాం. ప్రస్తుతం 12 మంది 60 శాతం కాలిన గాయాలతో క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. వారిని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నాం. వీరి పరిస్థితిని బట్టి కార్పొరేట్ హాస్పిటల్స్ కు షిఫ్ట్ చేస్తాం. మిగిలినవాళ్లకు 20 నుంచి 25 శాతం గాయాలయ్యాయి. వారికి ఎలాంటి ప్రమాదం లేదు. వీరంతా త్వరలోనే కోలుకుంటారు. పరిస్థితి ఇలా ఉంటే రాజకీయ విమర్శలు చేయడం సరికాదు. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి, యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం” అని మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు.