
నేపాల్: జెన్ జెడ్ యువత ఆందోళనలతో నేపాల్ రణరంగంగా మారిన విషయం తెలిసిందే. దేశంలో సోషల్ మీడియాపై నిషేధం, ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా జెన్ జెడ్ యువత కదం తొక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు చేశారు. యువత చేపట్టిన ఆందోళనలు తీవ్ర హింసాత్మకంగా మారడంతో కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం కుప్పకూలింది. పోలీసుల కాల్పుల్లో పలువురు చనిపోవడంతో యువత ఆగ్రహానికి గురైంది.
దీంతో నేపాల్ సుప్రీంకోర్టు, పార్లమెంట్ భవనం, ప్రధాని నివాసం, రాష్ట్రపతి నివాసంపై దాడులు చేశారు నిరసనకారులు. మంత్రులు, పలువురు అధికార పార్టీ ప్రజాప్రతినిధులపై ఎటాక్ చేశారు. కొందరు మంత్రులను వీధుల్లో పరిగెత్తించి పరిగెత్తించి చితకబాదారు. తీవ్ర ఆగ్రహంలో ఉన్న నిరసనకారులు అప్పటి ప్రధాని కేపీ శర్మ ఓలీ ఇంటిపైనా దాడి చేశారు. చివరకు ఆయనపై కూడా దాడి చేసేందుకు ఇంటిని ముట్టడించారు.
ఈ తరుణంలో ఆర్మీ సాయంతో కేపీ శర్మ ఓలీ హెలికాప్టర్లో దేశం విడిచిపారిపోయారు. అయితే.. కేపీ శర్మ ఓలీ దేశం విడిచిపోయే పారిపోయే ముందు కొంచెం హైడ్రామా నడిచినట్లు నేపాల్ న్యూస్ పోర్టల్ ఉకేరా నివేదించింది. ఉకేరా నివేదిక ప్రకారం.. 2025, సెప్టెంబర్ 9న నిరసనకారులు తన నివాసాన్ని ముట్టడించడంతో ప్రధాని కేపీ శర్మ ఓలీ ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్దేల్కు ఫోన్ చేశారు. పరిస్థితిని వివరించి పారిపోవడానికి హెలికాప్టర్ సిద్ధం చేయాలని కోరాడు.
ప్రధాని విజ్ఞప్తిని అంగీకరించిన ఆర్మీ చీఫ్ ఒక్క కండిషన్ పెట్టారు. ప్రధాని పదవికి రాజీనామా చేస్తేనే హెలికాప్టర్ పంపిస్తామని చెప్పారు. ఓ వైపు ఆందోళనకారులు చుట్టుముడుతుండటంతో చేసేదేమి లేక ఆర్మీ చీఫ్ కండిషన్ మేరకు కేపీ శర్మ ఓలీ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అధికారికంగా ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాక పారిపోవడానికి ఆర్మీ హెలికాప్టర్ పంపిందని ఉకేరా కథనంలో పేర్కొంది.