హైదరాబాద్, వెలుగు: కేసుల విచారణకు హాజరుకావాలని నోటీసు జారీ చేసే ముందు అందులో కేసుల వివరాలు పేర్కొనకుండా నోటీసు ఎలా ఇస్తారని సమాచార కమిషన్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ఒకే రోజు 404 కేసులను ఎలా విచారిస్తారని నిలదీసింది. కేసుల నంబర్లు లేకుండా విచారణకు హాజరు కావాలంటూ ఇచ్చిన నోటీసు చెల్లదని పేర్కొంటూ, తాజాగా మరో నోటీసు ఇవ్వాలని గురువారం ఆదేశించింది. సమాచార హక్కు చట్టం కింద కోరిన సమాచారానికి సంబంధించి ఆర్టీఐ కార్యకర్త వి.శ్యామ్.. కమిషన్ ముందు 404 అప్పీళ్లు దాఖలు చేశారు.
వీటిపై విచారణకు వివరాలతో 18న హాజరుకావాలంటూ ఇచ్చిన నోటీసును సవాలు చేస్తూ శ్యామ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ టి.మాధవీదేవి విచారణ చేపట్టారు. ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ..సమాచార కమిషనర్ పోస్టు ఏడాదిన్నర పాటు ఖాళీగా ఉండటంతో 17 వేలకుపైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. పిటిషనర్ ఒక్కరే 404 అప్పీళ్లు దాఖలు చేయగా, ఇంకోకరు 980, మరొకరు 832 దాఖలు చేశారన్నారు. జడ్జీ స్పందిస్తూ.. 400 కేసులూ ఒకే రోజు ఎలా విచారిస్తారని ప్రశ్నించారు. ఈ నెల 11న ఇచ్చిన నోటీసును రద్దు చేస్తున్నామని, తాజాగా కేసుల వివరాలతో నోటీసు జారీ చేయాలని సమాచార కమిషన్‌కు ఆదేశిస్తూ విచారణను మూసివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
