కన్నడ స్టార్స్ శివ రాజ్‌కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి లీడ్ రోల్స్‌లో అర్జున్ జన్య రూపొందించిన చిత్రం ‘45 ది మూవీ’. సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఉమా రమేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. మైత్రి డిస్ట్రిబ్యూషన్ ద్వారా జనవరి 1న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల కానుంది. శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ సందర్భంగా శివ రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. ‘అర్జున్ జన్య చెప్పిన కథ చాలా ఇంటరెస్టింగ్‌గా అనిపించింది. ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్‌కు అందరూ కనెక్ట్ అవుతారు. కన్నడలో ఆల్రెడీ సక్సెస్ అయింది. తెలుగులో మైత్రి వాళ్లు రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. ఈ మూవీని చూస్తే కచ్చితంగా ప్రతి ఒక్క ప్రాణిని ప్రేమిస్తారు.. గౌరవిస్తారు. ఎన్ని రోజులు భూమ్మీద బతుకుతామో తెలీదు. బతికినన్ని రోజులు సంతోషంగా బతకాలనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది’అని అన్నారు.
ఉపేంద్ర మాట్లాడుతూ ‘అర్జున్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంత సక్సెస్ అయ్యారో నాకు తెలుసు. ఈ చిత్రంతో దర్శకుడిగా కూడా ప్రూవ్ చేసుకున్నారు. శివన్నతో కలిసి నటించడం ఆనందంగా ఉంది’ అని చెప్పారు. ఈ మూవీలో ప్రేక్షకులు ఓ కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నారని దర్శకుడు అర్జున్ జన్య చెప్పాడు. గరుడ పురాణం గురించి చెప్పే చిత్రమిది అని నిర్మాత రమేష్ రెడ్డి అన్నారు. మంచి సందేశాన్ని ఇచ్చే ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయడం ఆనందంగా ఉందని మైత్రి శశి అన్నారు.
