సర్పంచుల జీతం రూ.20 వేలకు పెంచాలి: ఆర్.కృష్ణయ్య డిమాండ్

సర్పంచుల జీతం రూ.20 వేలకు పెంచాలి: ఆర్.కృష్ణయ్య డిమాండ్

ముషీరాబాద్, వెలుగు: సర్పంచులకు ప్రస్తుతం ఇస్తున్న గౌరవ వేతనాన్ని రూ.6,500 నుంచి రూ.20 వేలకు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన పలువురు బీసీ సర్పంచులు శనివారం విద్యానగర్​లోని బీసీ భవన్​లో ఆయనను కలిశారు. రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్​నగర్ జిల్లాల నుంచి వచ్చిన సర్పంచులు, వార్డు సభ్యులను సత్కరించిన అనంతరం కృష్ణయ్య మాట్లాడారు. జనాభా ప్రాతిపదికన వాటా ఇవ్వడంలో పాలకులు విఫలమైనప్పటికీ ప్రజలు బలహీన వర్గాల నాయకులకు అండగా నిలిచారని చెప్పారు.

బీసీ సర్పంచులను బెదిరిస్తే సహించేది లేదని, బడుగుల గ్రామాలకు వివక్ష లేకుండా నిధులు విడుదల చేయాలన్నారు. 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేశారు. బీసీల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తే సహించేది లేదని, కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం నిబద్ధత చూపాలన్నారు. అదే సమయంలో సర్పంచులకు ఇచ్చే గౌరవ వేతనాన్ని 20వేల రూపాయలకు పెంచాలని సూచించారు. ఎర్రోళ్ల రాఘవేందర్, చెరుకుల రాజేందర్, గవ్వల భరత్ కుమార్, కొప్పు వసంత తదితరులు పాల్గొన్నారు.

జడ్జిల నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించాలి
బషీర్​బాగ్: సుప్రీం, హైకోర్టు జడ్జిల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ బీసీ న్యాయవాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో కొత్త క్యాలెండర్, సంఘం'లోగో' ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. కొలీజియం పద్ధతిని రద్దు చేసి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో జుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసి జడ్జిల నియామక విధానాన్ని అమలు చేయాలని కోరారు.

బీసీల 42 శాతం రిజర్వేషన్లపై సమర్థవంతంగా వాదించినప్పటికీ జడ్జిలు వ్యతిరేకంగా ఉంటే కొట్టుడు పోతుందన్నారు. సమస్య వ్యక్తిగత అడ్వకేట్లులో కాదని, వ్యవస్థలోనే ఉందన్నారు. ప్రతి జూనియర్ అడ్వకేట్ కు నెలకు 20 వేల రూపాయలు స్టైఫండ్ చెల్లించాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.  ఈ సభలో సంఘం రాష్ట్ర కన్వీనర్ డి. శ్రీధర్, బీసీ నాయకులు నీల వెంకటేష్,   సుభాష్, సి. రాజేందర్ ముదిరాజ్, రాజ్ కుమార్, వంశీకృష్ణ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.