- మంత్రి పొంగులేటితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నేలకొండపల్లి, వెలుగు : ప్రజా ప్రభుత్వం ప్రతి పైసా రాష్ట్రంలోని ప్రజల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకే ఖర్చు చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి ఖమ్మం నేలకొండపల్లి మండలంలో పర్యటించి అనంతనగర్ లో ఏర్పాటు చేసిన 33/11 కేవీ సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. కామాంచికల్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యలు రాకుండా ఉండేందుకు సబ్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత పాలకులు రాష్ట్ర ప్రజలపై 8 లక్షల కోట్ల భారీ అప్పుల భారం మోపిందని, కానీ ప్రజా ప్రభుత్వం పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తోందన్నారు.
రైతుల కోసం ప్రతి సంవత్సరం రూ.12 ,500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ నాణ్యమైన విద్యుత్తు వ్యవసాయానికి ఉచితంగా అందిస్తోందని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న ఇతర పథకాలను వివరించారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రూ.2.25 కోట్లతో అనంత నగర్ లో నిర్మించిన సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం, రూ.1.75కోట్లతో కామంచికల్ లో నిర్మించనున్న సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన ఒకేరోజు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఏప్రిల్ నుంచి మరో విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. అనంతరం కలెక్టర్ తో కలిసి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
