రీల్స్ కోసం 160 స్పీడుతో కారు నడిపిన మైనర్.. బైక్ పై వెళ్తున్న యువకుడు మృతి..

రీల్స్ కోసం 160 స్పీడుతో కారు నడిపిన మైనర్.. బైక్ పై వెళ్తున్న యువకుడు మృతి..

రానురాను జనాల్లో రీల్స్ పిచ్చి పీక్స్ కి చేరుతోంది. రీల్స్ కోసం రిస్క్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఢిల్లీలో ఓ మైనర్ రీల్స్ కోసం 160 స్పీడుతో కారు నడిపి ఓ యువకుడి మరణానికి కారణమయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... సౌత్ వెస్ట్ ఢిల్లీలోని ద్వారకలో 17 ఏళ్ళ బాలుడు స్కార్పియో కారు 160 స్పీడుతో వచ్చి ఢీకొనడంతో బైక్ పై వెళ్తున్న సాహిల్ అనే 23 ఏళ్ళ యువకుడు మృతి చెందాడు.

నిందితుడు రాంగ్ రూట్లో కారులో వేగంగా వచ్చాడని.. బస్సు ముందుకు వచ్చి తన సోదరితో వీడియో రికార్డ్ చేస్తుండగా.. స్టంట్స్ చేశాడని సాహిల్ తల్లి ఇన్నా మకాన్ తెలిపారు. రీల్స్ మోజులో పడి బైక్ పై వెళ్తున్న తన కొడుకును అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది సాహిల్ తల్లి. 

కారు బైకును ఢీకొన్న తర్వాత కూడా నిందితుడు బ్రేక్ వేయలేదని అంటున్నారు మకాన్. ఈ ఘటనలో బస్సు, ఆగి ఉన్న కారు కూడా దెబ్బతిన్నాయని.. పక్కనే ఉన్న ట్యాక్సీ డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు మకాన్.

ఇది పొరపాటో, ప్రమాదమో కాదని.. హత్య అని అన్నారు మకాన్. నిందితుడి కారుపై గతంలో కూడా ఓవర్ స్పీడ్ చలాన్లు ఉన్నాయని అన్నారు. అతని తల్లిదండ్రులు కంట్రోల్ లో పెట్టి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదని అంటోంది బాధితురాలు. తాను సింగిల్ పేరెంట్ ని అయినప్పటికీ తన కొడుకు సాహిల్ ని 23 ఏళ్ళు ఎంతో జాగ్రత్తగా పెంచానని... ఇప్పుడు ఎవరో నిర్లక్ష్యానికి తన కొడుకును కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేస్తోంది మకాన్.