తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని యుఎస్ క్రికెటర్లు దర్శించుకున్నారు. మంగళవారం ( ఫిబ్రవరి 17) ఉదయం విఐపి విరామ సమయంలో మోనాంక్ పటేల్, సౌరభ్ నేత్రావల్కర్, మిలింద్ కుమార్ లు స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
ఆలయం వెలుపల యూఎస్ క్రికెటర్లు మీడియాతో మాట్లాడుతూ…. తిరుమల శ్రీవారి దర్శనం తమకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని అందించిందని తెలిపారు. తిరుమల క్షేత్రం, ఆలయ ప్రాంగణం అత్యంత పరిశుభ్రంగా, శ్రద్ధగా నిర్వహించబడుతున్న తీరు ప్రశంసనీయమని కొనియాడారు.
భారత్‌లో జరుగుతున్న వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం రావడం గర్వంగా ఉందని, తదుపరి మ్యాచ్‌ల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. ఈ పర్యటనకు సహకరించిన ఆలయ అధికారులు, వెంకయ్య చౌదరి, సతీష్ బాబు, ఐసీసీ , బీసీసీఐ, ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
