సకల పుణ్యకర్మ చయమును నొక దెస
వినుము పాడి దప్పకునికి యొక్క
దిక్కు: దీని శ్రుతులు తెలిపడునెడ, బాడి
కలిమి యెందు బెద్దగా నుతించె.
పుణ్యకార్యాలన్నీ ఒక ఎత్తు. ‘ధర్మం’ తప్పకుండా ఉండడం ఒక ఎత్తు. ఈ రెంటి తారతమ్యాలూ నిర్ణయించవలసి వస్తే ధర్మవర్తనదే ప్రథమ తాంబూలం.. అని విదురుడు ధృతరాష్ట్రుడికి చెబుతున్నాడు. (మహాభారతం, ఉద్యోగ పర్వం, ద్వితీయాశ్వాసం)
మహాభారతం మొత్తంలో ధర్మం అతిక్రమించనివాడు ధర్మరాజు ఒక్కడే. అందుకే యుధిష్ఠిరుడికి ‘ధర్మానికి రాజు.. ధర్మరాజు’ అని ఆ పేరు వచ్చింది. చాలామంది మొక్కుబడిగా పుణ్యకార్యాలు చేసేస్తే చాలు, పుణ్యం వచ్చేస్తుంది, మోక్షం లభించేస్తుంది అనుకుంటారు. కానీ ధర్మాన్ని అనుసరిస్తే చాలు..ప్రత్యేకంగా పుణ్యకార్యాలు చేయకపోయినా పరవాలేదని విదురుడు చెబుతున్నాడు.
మాయా జూదంలో పాండవులను ఓడించి, వారిని అరణ్యాల పాలు చేశారు కౌరవులు. ఆ తరవాత వారి రాజ్యంలో కావలసినన్ని పుణ్యకార్యాలు ఆచరించారు. భూసురులను ఆదరించారు, దానాలు విరివిగా చేశారు. అయితేనేం... నిండు కొలువులో ద్రౌపదిని పరాభవించారు. అధర్మ మార్గాన పాండవులను అడవుల పాలు చేశారు.
పదమూడు సంవత్సరాలు అరణ్య, అజ్ఞాత వాసాలు పూర్తి చేసుకుని వచ్చిన తరవాత కూడా వారి రాజ్యాన్ని వారికి ఇవ్వడానికి నిరాకరించాడు దుర్యోధనుడు. ఆ సమయంలో ద్రుపదుడు తన పురోహితుడిని రాయబారిగా పంపాడు. ధృతరాష్ట్రుడు సంజయుడిని రాయబారిగా పంపాడు.
పాండవుల దగ్గర నుంచి వెనుకకు మరలి వచ్చిన సంజయుడు, ‘మహారాజా! రేపు ఉదయాన్నే వచ్చి విషయాలన్నీ వివరిస్తాను. మార్గాయాసం కారణంగా ఈ రాత్రికి విశ్రాంతి తీసుకుంటాను’ అని పలికి ఇంటికి వెళ్లిపోయాడు. అక్కడ ఏం జరిగిందోననే ఆందోళనతో ధృతరాష్ట్రుడికి నిద్ర పట్టలేదు. విదురుడిని పిలిపించి, తనకు నాలుగు మంచి మాటలు చెప్పమన్నాడు.
ఆ సందర్భంలో విదురుడు పాండవుల ఔన్నత్యాన్ని, కౌరవుల దుర్మార్గాన్ని వివరించాడు. ‘ఎన్ని పుణ్యాకార్యాలు చేసినా, ధర్మాన్ని మించినది లేదు. నీ కుమారులు బాల్యం నుంచి అరాచకాలు చేస్తూనే ఉన్నారు. కానీ.. ధర్మరాజు ఏనాడూ ధర్మాన్ని అతిక్రమించలేదు’ అంటూ నీతిబోధ చేశాడు.
ధర్మానికి సంబంధించినఈ చిన్న కథలను పరిశీలిద్దాం...
ఒక గ్రామంలో ఒక కాకి, ఎద్దు ఉన్నాయి. ఈ రెండూ స్నేహంగా ఉంటున్నాయి. ఒకరోజు సాయంత్రం ఎద్దు పొలం నుంచి ఇంటికి వచ్చింది. ఎద్దు రావడం చూసి, కాకి ఎద్దు దగ్గరకు వచ్చి, ‘నువ్వు తెలివితక్కువదానివి. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఎంతో కష్టపడతావు. నీతో బరువులు మోయిస్తారు. పొలం దున్నిస్తారు. నిన్ను ఇంత కష్టపెడుతూ, కేవలం నాలుగు గడ్డి పరకలు, కాస్తంత కుడితి ఇస్తున్నారు. నన్ను చూడు! హాయిగా.. కష్టపడకుండా... ఏది దొరికితే దానిని ముక్కుతో తీసుకుపోతాను’ అని పలికింది.
అందుకు ఎద్దు, ‘కాకి బావా! నువ్వు పాపకార్యం చేస్తున్నావు. నేను నా ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాను. నేను పొలం దున్నడం వల్ల ఎంతోమంది కడుపు నిండా భోజనం చేయగలుగుతున్నారు. ఒక చోట నుండి మరో ప్రదేశానికి ప్రయాణం చేయగలుగుతున్నారు. ఇంతమందికి సహాయపడటమే నా ధర్మం. నీలాగ దొంగతనం చేసిన ఆహారాన్ని నేను జీర్ణించుకోలేను. అది ధర్మానికి విరుద్ధం’ అని పలికింది.
ఒకసారి ఒక అమ్మాయి గుడిలో నైవేద్యం పెట్టడానికి ప్రసాదం తీసుకుని బయలుదేరింది. నైవేద్యానికి వేళ అతిక్రమిస్తోందని పరుగుపరుగున నడుస్తోంది. ఇంతలో దారిలో ఒక ముసలి దంపతులు కనిపించారు. ‘ఆకలి.. ఆకలి’ అంటూ బాధతో విలపిస్తున్నారు. వెంటనే ఆ అమ్మాయికి ‘ఇతరుల ఆకలిని తీర్చడం మానవుల ధర్మం’ అనే మాట గుర్తుకు వచ్చింది.
భగవంతుడికి నైవేద్యం పెడితే పుణ్యం వస్తుంది. కానీ.. ఆకలి తీరిస్తే ధర్మాన్ని నిలబెట్టినట్లవుతుంది. ఒక ధర్మకార్యం కొన్ని పుణ్యకార్యాలతో సమానమని పెద్దలు చెప్పిన దానిని అనుసరించాలని భావించింది. తక్షణమే ఏమీ ఆలోచించకుండా ఆ ప్రసాదాన్ని వారికి ఆహారంగా పెట్టింది. వారు ఆ ప్రసాదాన్ని కడుపునిండా తిని తృప్తి చెందారు.
మనకు ధర్మార్థకామమోక్షాలు అని చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ధర్మం. ధర్మాన్ని అనుసరించే ధనసంపాదన, కామసాధన చేయాలి. అప్పుడు మన ప్రయత్నం లేకుండానే మోక్షం లభిస్తుందని పెద్దలు చెబుతారు.
