మ్యూచువల్ ఫండ్స్ అలర్ట్: ఈ7 విషయాలు తెలుసుకోకుండా రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయెుద్దు!

మ్యూచువల్ ఫండ్స్ అలర్ట్: ఈ7 విషయాలు తెలుసుకోకుండా రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయెుద్దు!

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం అంటే కేవలం పక్కింటి వారు చెప్పారనో లేదా స్నేహితులు కొన్నారనో నిర్ణయం తీసుకోవడం కాదు. మీ కష్టార్జితాన్ని ఇన్వెస్ట్ చేసే ముందు.. ఆ ఫండ్ ఫ్యాక్ట్‌షీట్ లోని అంశాలను చదవడం చాలా ముఖ్యం.  ఫ్యాక్ట్‌షీట్ చదవడం మిమ్మల్ని ఒక బాధ్యతాయుతమైన ఇన్వెస్టర్‌గా తీర్చిదిద్దుతుందని గుర్తుంచుకోండి. ఒక్క రూపాయి అయినా ఇన్వెస్ట్ చేయాలని అనుకునే ముందుగా తెలివైన ఇన్వెస్టర్ గమనించాల్సిన 7 కీలక అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1. ఫండ్ మేనేజర్ ఎవరు..? 
అన్నింటి కంటే ముందుగా మీరు ఇన్వెస్ట్ చేయబోతున్న డబ్బును మేనేజ్ చేసే ఫండ్ మేనేజర్ అనుభవం, ట్రాక్ రికార్డ్ గురించి తెలుసుకోవాలి. అయితే కేవలం ఒక్క 'స్టార్ మేనేజర్' పైనే ఆధారపడటం కంటే.. ఆ సంస్థకు ఉన్న 'ఇన్వెస్ట్‌మెంట్ ప్రాసెస్ ముఖ్యం. ప్రశాంత్ జైన్, రోషీ జైన్ వంటి దిగ్గజాలు మారినప్పుడు ఫండ్ పనితీరు దెబ్బతినకుండా ఉండాలంటే.. ఆ ఫండ్ హౌస్ ప్రాసెస్ డ్రివెన్ విధానాన్ని అనుసరించాలి.

2. ఎక్స్‌పెన్స్ రేషియో:
ఫండ్ నిర్వహణ కోసం కంపెనీ వసూలు చేసే రుసుము ఇది. ఇది ఎంత తక్కువగా ఉంటే మీకు అంత లాభం. ఉదాహరణకు 0.04% వ్యత్యాసం కూడా 30 ఏళ్ల కాలంలో మీ చేతికి వచ్చే మొత్తంలో లక్షల రూపాయల తేడాను చూపిస్తుంది. కాబట్టి తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడినిచ్చే ఫండ్లను ఎంచుకోవడం తెలివైన పని.

3. పోర్ట్‌ఫోలియో డిజైన్:
మీ ఫండ్ ఏ కంపెనీల్లో.. ఏయే రంగాల్లో పెట్టుబడి పెడుతుందో గమనించాలి. ఉదాహరణకు పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి విదేశీ కంపెనీల్లోనూ పెట్టుబడి పెడుతుంది. అదే హెచ్‌డీఎఫ్‌సీ ఫండ్ దేశీయ మార్కెట్‌పైనే దృష్టి పెడుతుంది. ఇలాంటి డిజైన్ మీ పెట్టుబడికి భద్రతను పెంచటమే కాక మంచి స్టెబిలిటీని కూడా దీర్ఘకాలంలో అందిస్తుంది.

4. పోర్ట్‌ఫోలియో టర్నోవర్ రేషియో:
ఫండ్ మేనేజర్ షేర్లను ఎంత తరచుగా కొంటున్నారు.. అమ్ముతున్నారు అనే విషయాన్ని ఇది చెబుతుంది. టర్నోవర్ రేషియో ఎక్కువగా ఉంటే మేనేజర్ మార్కెట్ ట్రెండ్ వెంట పడుతున్నారని.. తక్కువగా ఉంటే దీర్ఘకాలిక వ్యూహంతో ఉన్నారని అర్థం. తక్కువ టర్నోవర్ ఉన్న ఫండ్స్ తరచుగా స్థిరమైన రాబడులను అందిస్తుంటాయి.

5. వ్యాల్యుయేషన్ రేషియోలు:
ప్రైస్-టు-ఈక్విటీ, ప్రైస్-టు-బుక్ రేషియోలు ఆ ఫండ్ ఎంత అగ్రెసివ్‌గా లేదా ఎంత జాగ్రత్తగా ఉందో చెబుతాయి. తక్కువ PE ఉన్న ఫండ్లు వాల్యూ ఇన్వెస్టింగ్ అంటే తక్కువ ధరలో ఉన్న మంచి షేర్లను అనుసరిస్తాయి. మీ రిస్క్ సామర్థ్యాన్ని బట్టి వీటిని చూసుకోవాలి.

6. గత చరిత్ర:
గత ఏడాది లాభాలను మాత్రమే చూసి మోసపోకండి. మార్కెట్ ఒడిదుడుకులకు లోనైనప్పుడు ఆ ఫండ్ ఎంత నిలకడగా రాబడిని ఇచ్చిందో చూడాలి. గతంలో బాగా రాణించిన ఫండ్ భవిష్యత్తులోనూ అలాగే ఉంటుందని గ్యారెంటీ లేదు. కానీ దాని స్థిరత్వం మనకు రాబోయే రిటర్న్స్ విషయంలో నమ్మకాన్ని ఇస్తుంది.

7. రిస్క్ మేనేజ్‌మెంట్:
పెట్టుబడి అంటే రిస్క్‌ను నిర్వహించడం.. దాని నుంచి పారిపోవడం కాదు. షార్ప్, సోర్టినో రేషియోల ద్వారా ఆ ఫండ్ తీసుకునే రిస్క్‌కు తగ్గట్టుగా ఎంత అదనపు లాభాన్ని ఇస్తుందో తెలుసుకోవచ్చు. లాభాల కంటే రిస్క్-అడ్జస్టెడ్ రిటర్న్స్ పై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ఇవి పెట్టుబడికి సేఫ్టీతో పాటు మార్కెట్ల ఒడిదొడుకుల్లో తక్కువ నష్టాలు వచ్చే విధంగా డిజైన్ చేయబడి ఉంటాయి.