ఊళ్లోని పోస్ట్ ఆఫీసులోనే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు.. గ్రామీణ ఇన్వెస్టర్లకు కొత్త అవకాశం..

ఊళ్లోని పోస్ట్ ఆఫీసులోనే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు.. గ్రామీణ ఇన్వెస్టర్లకు కొత్త అవకాశం..

ఇండియా పోస్ట్.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మధ్య కుదిరిన తాజా ఒప్పందంతో దేశంలోని మారుమూల గ్రామాలకు సైతం మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు చేరువకానున్నాయి. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఈ ఒప్పందం ద్వారా.. ఇకపై ప్రతి ఊరి పోస్ట్ ఆఫీసులోనే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే అవకాశం కలుగుతుంది దేశ ప్రజలకు. 

దేశవ్యాప్తంగా ఉన్న 1.64 లక్షలకు పైగా పోస్ట్ ఆఫీసుల నెట్‌వర్క్‌ సామాన్య ప్రజలకు క్యాపిటల్ మార్కెట్ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడమే ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం. నగరాల్లో ఎక్కువగా వినిపించే మ్యూచువల్ ఫండ్ అనే పదం.. ఇకపై ప్రతి పల్లెటూరి ఇంటి గడప వరకు చేరుకోనుంది. దీనివల్ల గ్రామీణ ప్రజలు తమ పొదుపు మొత్తాలను మెరుగైన రాబడినిచ్చే మార్గాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు మార్గం సుగమం అయ్యింది.

ట్రైన్డ్ స్టాఫ్..
దీని కింద ఎంపిక చేసిన పోస్టల్ ఉద్యోగులకు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లుగా శిక్షణ ఇస్తారు. వీరు 'నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్' నుంచి సర్టిఫికేషన్ పొందిన తర్వాతే పెట్టుబడిదారులకు సేవలు అందిస్తారు. NSE అందించే అత్యాధునిక డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఆర్డర్ ప్లేస్‌మెంట్ నుంచి సెటిల్‌మెంట్ వరకు అంతా పారదర్శకంగా.. సెబీ రూల్స్ కి అనుగుణంగా జరుగుతుంది.

విడతల వారీగా అమలు..
మొదటగా కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ సేవలను ప్రారంభిస్తారు. అక్కడ వచ్చే స్పందనను బట్టి క్రమంగా దేశవ్యాప్తంగా అన్ని పోస్ట్ ఆఫీసులకు విస్తరిస్తారు. దీనివల్ల టైర్-2, టైర్-3 నగరాలతో పాటు కుగ్రామాల్లో కూడా ఇన్వెస్టర్ల అవగాహన పెరుగుతుంది. పట్టణ ప్రాంతాల వారికే పరిమితమైన ఆధునిక పెట్టుబడి సాధనాలు ఇప్పుడు రైతులకు, సామాన్య కూలీలకు కూడా అందుబాటులోకి రానున్నాయి.

గ్రామీణ ఆర్థిక ప్రగతి..
కేవలం సేవింగ్స్ అకౌంట్లు, స్మాల్ సేవింగ్ స్కీమ్స్ కే పరిమితమైన పోస్ట్ ఆఫీసులు.. ఇప్పుడు స్టాక్ మార్కెట్ అనుసంధాన ఉత్పత్తులను అందించడం ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. గ్రామీణ ప్రజలు తమ భవిష్యత్తు అవసరాల కోసం, పిల్లల చదువుల కోసం లేదా పెళ్లిళ్ల కోసం మ్యూచువల్ ఫండ్లలో SIP ద్వారా ఈజీగా పెట్టుబడి పెట్టవచ్చు. మెుత్తానికి గ్రామాల్లోని ప్రజలకు కూడా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు జస్ట్ నాలుగు అడుగుల దూరంలోకి తీసుకురావటం పెద్ద మార్పులకు దారితీయెుచ్చు. స్టాక్ మార్కెట్లోకి ఇకపై గ్రామాల ప్రజల డబ్బు కూడా వచ్చి చేరటానికి వీలు కలిగింది.