హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ పూర్తయింది. సాయంత్రం 5 గంటల వరకే ఎన్నికల సంఘం ఓటు హక్కు వినియోగించుకునేవారికి అవకాశం ఇచ్చింది. అయితే అప్పటికే క్యూ లైన్లో ఉన్నవారికే ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అధికారులు అనుమతి ఇచ్చారు. ఫిబ్రవరి 13న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది.
* ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముగిసిన పోలింగ్
* ఆదిలాబాద్ , నిర్మల్ , బైంసా, ఖానాపూర్, అసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలలో ముగిసిన పోలింగ్
* క్యూలైన్లో ఉన్నా ఓటర్లకు ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తున్న అధికారులు
* మహబూబ్‌నగర్ జిల్లాలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్
* గేట్లకు తాళం వేసిన పోలీసులు. ఐదు గంటల వరకు వరుసలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అనుమతి.
మున్సిపల్ ఎన్నికల్లో గెలుపోటములపై ఆయా పార్టీల నేతలు ఎవరి ధీమాలో వారున్నారు. ఆరు రోజులుగా జరిగిన ప్రచారం, ఆ తర్వాత చేపట్టిన పోల్ మేనేజ్మెంట్ను ఆధారం చేసుకొని గెలుపు మాదంటే.. మాదేనని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి ఐదు బహిరంగ సభలలో పాల్గొని ప్రసంగించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి తమకు ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర మంత్రులు తమకు కేటాయించిన పార్లమెంట్‌స్థానం పరిధిలోని మున్సిపాలిటీల ఎన్నికల బాధ్యతలను తమ భుజస్కంధాలపై వేసుకొని పనిచేశారు. పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు, సీనియర్లంతా ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపారు.
బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డితో పాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అలాగే, బీజేపీ ఎంపీలంతా కూడా తమ నియోజకవర్గాల పరిధిలో పోటాపోటీగా క్యాంపెయినింగ్ నిర్వహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాష్ట్రంలో ఆ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడాన్ని బట్టి ఈ ఎన్నికలను బీజేపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సైతం రాష్ట్రమంతా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫాం హౌస్‌కే పరిమితం కాగా, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావు పార్టీ భారాన్నంతా మోశారు. తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. ఆ పార్టీకి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారు.
