మ్యూచువల్ ఫండ్లలో దీర్ఘకాలిక పెట్టుబడి ఎలాంటి సంపదను సృష్టిస్తుందో చెప్పడానికి కోటక్ లార్జ్ క్యాప్ ఫండ్ ఒక అద్భుత ఉదాహరణగా నిలుస్తోంది. ఈ ఫండ్ ప్రారంభమై 23 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదలైన గణాంకాలు ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరుస్తున్నాయి. 2003లో ఈ ఫండ్‌లో కేవలం రూ.వెయ్యి చేసి దానిని అలాగే ఉంచి ఉంటే.. నేడు దాని విలువ ఏకంగా రూ.48,869కి చేరుకుంది. అంటే దాదాపు 48 రెట్ల వృద్ధిని నమోదు చేస్తూ ఏటా సగటున 18% వార్షిక రాబడిని అందించింది. అందుకే లాభాలు ఓపిక ఉన్న వాళ్లకే ఉంటాయని సక్సెస్ ఫుల్ ఇన్వెస్టర్లు చెబుతుంటారు.
కేవలం ఒకేసారి పెట్టుబడి పెట్టిన వారికే కాకుండా.. సిప్ విధానంలో క్రమబద్ధంగా పెట్టుబడి పెట్టిన వారికి కూడా ఈ ఫండ్ కాంపౌండింగ్ మ్యాజిక్‌ను రుచి చూపించింది. 2003లో నెలకు రూ.వెయ్యి చొప్పున సిప్ ప్రారంభించిన ఇన్వెస్టర్, ఇప్పటివరకు మొత్తం రూ. 2లక్షల 76వేల పెట్టుబడి పెట్టి ఉంటారు. నేడు ఆ పెట్టుబడి విలువ సుమారు రూ.19లక్షల 49 వేలుగా మారింది. ఇది 14 శాతం వార్షిక వృద్ధిని సూచిస్తోంది. ఈ అద్భుతమైన పనితీరు కారణంగానే ఈ ఫండ్ మొత్తం ఆస్తుల విలువ ప్రస్తుతం రూ.11వేల కోట్ల మార్కును దాటింది.
ఈ ఫండ్ ప్రధానంగా దేశంలోని టాప్ 100 లార్జ్ క్యాప్ కంపెనీలలో పెట్టుబడులు పెడుతుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, ఎల్‌అండ్‌టి వంటి దిగ్గజ కంపెనీలు ఈ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో టాప్ హోల్డింగ్స్‌గా ఉన్నాయి. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకుంటూ.. బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ కంటే మెరుగైన పనితీరు కనబరచడం ఈ ఫండ్ ప్రత్యేకత. అయితే గత ఆరు నెలల కాలంలో రిటర్న్స్ కొంత నెమ్మదించినా.. 10 ఏళ్ల కాలపరిమితిలో 13.73% వార్షిక రాబడిని అందిస్తూ స్థిరత్వాన్ని నిరూపించుకుంది.
దీని నుంచి నేటి తరం ఇన్వెస్టర్లు గమనించాల్సింది ఏంటంటే.. గతంలో వచ్చిన 48 రెట్ల లాభాలు భవిష్యత్తులోనూ అలాగే వస్తాయని గ్యారెంటీ లేదు. ఈక్విటీ మార్కెట్లు ఎప్పుడూ ఆర్థిక పరిస్థితులు, వడ్డీ రేట్ల మార్పులకు లోబడి ఉంటాయి. అందుకే కేవలం పాత లెక్కలను చూసి కాకుండా.. మీ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీర్ఘకాలం పాటు ఓపికగా పెట్టుబడిని కొనసాగించే వారికి మ్యూచువల్ ఫండ్స్ ఒక గొప్ప సంపద సృష్టికి తోడ్పడతాయని ఈ కోటక్ ఫండ్ జర్నీ నిరూపిస్తోంది.
