- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
అశ్వారావుపేట/దమ్మపేట, వెలుగు: నాగరిక సమాజంలో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో? అదే రీతిలో ఆదివాసీ గిరిజన గ్రామాల్లో ఉండేలా సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ప్రాధాన్యత ఉంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కొండరెడ్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడదుల చేయనున్నట్లు తెలిపారు. శనివారం దమ్మపేట మండలం పూసుకుంటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండరెడ్లలో గిరిజన కుటుంబాల్లో వెలుగులు నింపేలా ఐటీడీఏ ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఆర్థికంగా అభివృద్ధి చెంది జీవనోపాధి పొందేందుకు ఐటీడీఏ పీవో, కలెక్టర్ మాస్టర్ ప్లాన్ తయారు చేయలని సూచించారు.
ప్రతినెలా తప్పనిసరిగా గ్రామంలో హెల్త్ క్యాంపులు నిర్వహించాలన్నారు. పంట పొలాల్లో ఉన్న జామాయిల్ చెట్లను తీయించివేసి పామాయిల్ మొక్కలను నాటాలని, దీనిపై రైతులు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ లోపు గ్రామానికి రోడ్డు సౌకర్యం, సబ్ సెంటర్ నిర్మాణం, గ్రామపంచాయతీ భవన్, పామాయిల్ మొక్కలు పెంపకం కుటుంబానికి బోరు, సోలార్ కరెంటు, ఇందిరమ్మ ఇండ్ల సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. కొండ్రెడ్ల గ్రామాలకు దాదాపు రూ. 30 కోట్లు కేటాయించామని తెలిపారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ 237 కొండరెడ్డి గిరిజన కుటుంబాలకు వందశాతం ఇండ్లు అందించామని, నియోజకవర్గానికి 11 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తు చేశారు.
కలెక్టర్ జితేశ్ మాట్లాడుతూ కొండరెడ్డి కుటుంబాలు వ్యవసాయం మీదే కాక హార్టీకల్చర్, సెరికల్చర్ పై దృష్టి సారించాలని సూచించారు. పీవో రాహుల్ మాట్లాడుతూ 18 మంది కొండరెడ్ల గిరిజన రైతులకు 75 ఎకరాలలో పామాయిల్ మొక్కలు పెంచుకోవడానికి ఆయిల్ పామ్ ప్లాంటేషన్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధు, హౌసింగ్ పీడీ రవీంద్రనాథ్, సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ట్రైబల్ వెల్ఫేర్ మధుకర్, ఆయిల్ ఫెడ్ ఆఫిసర్ రాధాకృష్ణ, ఎంపీవో రామారావు, ఇన్చార్జి తహసీల్దార్ రాణి, హౌసింగ్ ఏఈ రాము, జిల్లా ఉద్యానధికారి కిషోర్, పూసుకుంట సర్పంచ్ రాజిరెడ్డి ఉన్నారు.
