- హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రావణ్ కుమార్
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: కక్షిదారులకు సత్వర న్యాయం అందించి రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని హైకోర్టు న్యాయమూర్తి, మహబూబ్ నగర్ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ ఎన్వీ శ్రావణ్ కుమార్ కోరారు. శనివారం నగరంలోని బండమీదిపల్లి వద్ద రూ.81 కోట్లతో నిర్మించనున్న కోర్టు కాంప్లెక్స్‌కు హైకోర్టు న్యాయ మూర్తులు జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి, జస్టిస్ టి.మాధవి, జస్టిస్ నందికొండ నర్సింగరావు, కలెక్టర్ విజయేందిరబోయితో కలిసి భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టుకు వచ్చే కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు న్యాయవాదులు, న్యాయమూర్తులు సమర్థవంతంగా పని చేయాలని సూచించారు. ఈ ఏడాది నవంబర్ 30 నాటికి మహబూబ్ నగర్ లో 18,446 కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. జిల్లా కేంద్రంలో 16, జడ్చర్లలో 3 కోర్టుల్లో 293 మంది సిబ్బందికి గాను, 252 మంది పని చేస్తున్నారని చెప్పారు. జిల్లాలో 504 మంది అడ్వకేట్లు ఉండగా, 35 మంది మహిళా అడ్వకేట్లు ప్రాక్టీస్ చేస్తున్నారని తెలిపారు.
కలెక్టర్, ఎస్పీ. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహిళలు కావడం గొప్ప విషయమని చెప్పారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ పెండింగ్ కేసుల పరిష్కారం న్యాయమూర్తులు, న్యాయవాదులదే బాధ్యత కాదని, అందరికీ బాధ్యత ఉంటుందన్నారు. హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 27 నుంచి 42కు పెరిగినా 2.33 లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసులు తగ్గించుకోవాలని సూచించారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత, ఎస్పీ డి.జానకి, అడిషనల్ సొలిసిటర్ జనరల్ నరసింహ శర్మ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ భుజంగ్‌రావు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అనంత రెడ్డి, శ్రీధర్ రావు పాల్గొన్నారు.
