- ఏదులాపురం మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
- మండల సమీకృత భవన సముదాయ పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన
ఖమ్మం రూరల్, వెలుగు : ఏదులాపురం మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం ఏదులాపురం మున్సిపాలిటీ ప్రాంతంలో ఖమ్మం రూరల్ మండల సమీకృత కార్యాలయాల భవన సముదాయ నిర్మాణ పనులకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తో కలిసి మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ అభివృద్ధి పనులు వెనుకడుగు వేయకుండా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు.
రూరల్ మండలంలో కార్యాలయ సముదాయ నిర్మాణ పనులు రూ. 45 కోట్లతో చేపట్టామని, 9 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఏదులాపురం మున్సిపాలిటీ అభివృద్ధికి గత రెండేండ్లలో రూ. 221 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను మంత్రి వివరించారు.
కలెక్టర్ మాట్లాడుతూ రూ.45 కోట్లతో సమీకృత మండల కార్యాలయ సముదాయం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉందని, పనులు నాణ్యతగా, వేగంగా సాగుతున్నా యని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర్ రావు, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్‌బాబు, ఆర్ అండ్ బీ ఎస్ఈ యాకోబు, ఆర్డీఓ నరసింహారావు, ఆర్ అండ్ బీ ఈఈ పవార్ ఉన్నారు.
