ఉప ఎన్నిక వస్తే మళ్లీ గెలుస్త.. కార్యకర్తలే నా బలం: ఎమ్మెల్యే దానం నాగేందర్

ఉప ఎన్నిక వస్తే మళ్లీ గెలుస్త.. కార్యకర్తలే నా బలం: ఎమ్మెల్యే దానం నాగేందర్

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లే ధైర్యం తనకు ఉందని, కార్యకర్తలే తన బలమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. శనివారం నియోజకవర్గంలోని హిమాయత్ నగర్ డివిజన్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, దీనికి కార్యకర్తల బలమే కారణమని చెప్పారు. ఉప ఎన్నిక వస్తే మళ్లీ గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ‘‘సీఎంను కేటీఆర్​ ఏకవచనంతో పిలుస్తున్నారు. సీఎంను గౌరవించకుండా విమర్శలు చేస్తే ప్రతి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 

వ్యక్తిగత విమర్శలను పక్కనపెట్టి, కాంగ్రెస్  చేస్తున్న అభివృద్ధిపై చర్చకు రావాలి” అని  కేటీఆర్‌‌కు సూచించారు. రాష్ట్రంలో ఇద్దరు మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ఆరోపణలపై దానం స్పందిస్తూ.. ‘‘ఆయన శాఖ పరిధిలోనే దర్యాప్తు సంస్థలు ఉంటాయి. అవినీతిపై ఆధారాలు ఉంటే విచారణ జరిపించాలి” అని సూచించారు.