- కలెక్టర్‌కు డిప్యూటీ మేయర్ వినతి
హైదరాబాద్ సిటీ, వెలుగు: తార్నాకలోని విజయ డెయిరీ కార్పొరేషన్ ప్రాంగణంలో కొనసాగుతున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు శాశ్వత భూమి కేటాయించాలని జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతాశోభన్ రెడ్డి కోరారు. శనివారం హైదరాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ హరి చందన దాసరిని కలిసి వినతిపత్రం అందజేశారు. పాఠశాలను ఖాళీ చేయాలంటూ విజయ డెయిరీ కార్పొరేషన్ నోటీసు జారీ చేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొందన్నారు.
చింతల్ బస్తీ, ఎర్రకుంట, బాబా నగర్, హనుమాన్ నగర్, గోకుల్ నగర్ బస్తీ, ఆర్య వాటిక వంటి పరిసర ప్రాంతాల్లోని ఆర్థికంగా బలహీన వర్గాల పిల్లలకు ఈ పాఠశాల ఏకైక విద్యా కేంద్రంగా ఉందని తెలిపారు. పాఠశాల భవనం శిథిలావస్థలో ఉండడంతో విద్యార్థుల భద్రతకు ముప్పు ఏర్పడిందని, చిన్న గదులు, మౌలిక వసతుల లేమి, పరిశుభ్రత లోపంతో పాములు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల కారణంగా విద్యార్థుల సంఖ్య 450 నుంచి 100కు తగ్గిందని వివరించారు.
విద్యా సంవత్సరం మధ్యలో పాఠశాల ఖాళీ చేయడం విద్యార్థుల చదువుకు తీవ్ర అంతరాయం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రస్తుత భవనానికి గడువు పొడిగించడంతోపాటు తార్నాకాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నిర్మాణానికి శాశ్వత భూమి కేటాయించాలని కలెక్టర్‌ను కోరారు.
