- రాజకీయపరమైన కేసులు మినహా అత్యాచారం, హత్య లాంటి కేసులున్నోళ్లు పదవులకు దూరం
- క్లీన్చిట్ ఉన్నోళ్లకే డీసీసీలో చోటు ఇవ్వాలని మీనాక్షి ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: డీసీసీ (జిల్లా కాంగ్రెస్ కమిటీ) చీఫ్‌లను ఇప్పటికే నియమించిన కాంగ్రెస్ హైకమాండ్..వాటి కార్యవర్గాలను వెంటనే నియమించడంపై దృష్టిపెట్టింది. ఈ బాధ్యతను ఏఐసీసీ అబ్జర్వర్లకు అప్పగిస్తూ పూర్తి స్వేచ్ఛనిచ్చింది. అయితే కార్యవర్గంలో ఎలాంటి నేర చరిత్రలేని నాయకులనే తీసుకోవాలని ఏఐసీసీ అబ్జర్వర్లకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ స్పష్టమైన సంకేతాలిచ్చారు.
ఇటీవల అబ్జర్వర్లతో మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ సమావేశమై.. హైకమాండ్ ఆలోచన విధానాన్ని తెలియజేశారు. జనవరి మొదటి వారంలో డీసీసీ కార్యవర్గాల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని జాతీయ నాయకత్వం ఆదేశించడంతో అబ్జర్వర్లు వీటిపై దృష్టి పెట్టారు. గతంలో వివాదాస్పద, క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న నేతలకు పీసీసీ, డీసీసీలో పదవులు ఇచ్చారు.
కానీ ఈసారి మాత్రం డీసీసీలో ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కార్యదర్శి, ట్రెజరర్, ఇతర కార్యవర్గ సభ్యుల నియామకం విషయంలో అలాంటి వారికి ఎట్టి పరిస్థితుల్లో చోటు ఇవ్వొద్దని అబ్జర్వర్లకు మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. రాజకీయ పరమైన కేసులు ఎదుర్కొంటున్న నాయకులను మాత్రం పదవులకు దూరం చేయవద్దని ఆదేశించారు. ఇదే సమయంలో హత్య, అత్యాచారం, ఇతర క్రిమినల్ హిస్టరీ ఉన్న ఆశావహులను ఈ పదవుల కోసం పరిగణనలోకి తీసుకోవద్దని నిర్ణయించారు.
నేతల నేర చరిత్రపై ఫోకస్
సామాజిక సమీకరణలకు పెద్దపీట వేయాలని భావిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. అయితే, డీసీసీలో ఏ సమీకరణాలతో ఎవరికి చోటు ఇవ్వాలని అనుకున్నా.. ముందుగా వారి నేర చరిత్రను తెలుసుకొని క్లీన్ చిట్ అని తేలితేనే కార్యవర్గంలోకి తీసుకోవడానికే అబ్జర్వర్లు ప్రాధాన్యమిస్తున్నారు. జిల్లాలవారీగా నేతల క్రైమ్ హిస్టరీపై ఆరా తీస్తున్నారు.
జిల్లా కార్యవర్గంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం ఉండేలా చూడాలని, ఇందులో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు పాత, కొత్త కలయికతో కార్యవర్గం ఉండేలా చూడాలని హైకమాండ్ ఆదేశించింది. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారికి కూడా 20 నుంచి 30% కమిటీలో చోటు కల్పించాలనే నిబంధనను హైకమాండ్ అమలు చేస్తున్నది. దీంతో పాత, కొత్త నేతలు తమ అనుచరులకు కార్యవర్గంలో చోటు దక్కడం కోసం తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
