పెట్టుబడులకు హైదరాబాద్ నగరం గేట్ వే అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.ఢిల్లీలో 12వ పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా సదస్సులో పాల్గొన్న సీఎం.. పెట్టుబడులకు అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. విజన్ తెలంగాణ రైజింగ్ అనే అంశంపై స్పీచ్ ఇచ్చిన సీఎం.. హైదరాబాద్, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అవకాశాలను సమ్మిట్ లో వివరించారు.
తెలంగాణలో ట్రిపుల్ ఆర్ నిర్మాణం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు సీఎం రేవంత్. ఐటీ, ఫార్మా కంపెనీల కోసం రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కోర్ సిటీలోని ఇండస్ట్రీస్ ఓఆర్ఆర్ బయటకు తరలిస్తామని చెప్పారు. సిటీ నుంచి రూరల్ ఏరియాలకు రోడ్ల డెవలప్ మెంట్ చేస్తామని.. గ్రామీణ ప్రాంతాలకు కూడా పరిశ్రమలను విస్తరిస్తున్నామని చెప్పారు.
హైదరాబాద్ లో ఓఆర్ఆర్, మెట్రోతో కనెక్టివిటీ ఉందని చెప్పిన సీఎం.. కల్చరల్ కనెక్టివిటీకి భాగ్యనగరం రోల్ మోడల్ అని అన్నారు. హైదరాబాద్ మెట్రోలో రోజుకు 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారని.. రానున్న ఐదేళ్లలో రోజుకు 15 లక్షల మంది ప్రయాణం లక్ష్యమని తెలిపారు.
అదే విధంగా హైదరాబాద్ లో 3 వేల ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో తెలంగాణ ముందుందని.. రానున్న రోజుల్లో కేవలం ఎలక్ట్రిక్ బస్సులనే వినియోగిస్తామని తెలిపారు.
రాష్ట్రంలో మూసీ అభివృద్ధితో మరింత డెవలప్ మెంట్ ఉంటుందని తెలిపారు. ఎడ్యుకేషన్, హెల్త్ హబ్ గా హైదరాబాద్ సిటీని తయారు చేస్తున్నట్లు చెప్పారు. శాంతి భద్రతల విషయంలో తెలంగాణ నెం.1గా ఉందని సమ్మిట్ లో తెలిపారు. తెలంగాణ బ్రాండ్ ను మరింత ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
రానున్న రోజుల్లో మూసీలో గోదావరి నీటిని పారిస్తామని సీఎం తెలిపారు. గుజరాత్ లో సబర్మతీ రివర్ ఫ్రంట్, ఢిల్లీలో యమునా రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ తరహాలో మూసీ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని ఈ సందర్భంగా సీఎం కోరారు. హదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరుకుకి బుల్లెట్ ట్రైన్ ఇవ్వాలని కోరుతున్నట్లు చెప్పారు.
