
పేకాట ప్రాణాలు తీసింది. ఔను రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ వ్యక్తి పేకాట ఆడుతుండగా పోలీసులు దాడి చేశారు. పారిపోవడానికి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి పరుగెత్తుతుండగా రాజయ్య అనే వ్యక్తి అక్కడిక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు.
స్థానికుల సమాచారం మేరకు, వెంకటాపూర్ గ్రామానికి చెందిన చాకలి రాజయ్య (55) కొంతకాలంగా గుండెజబ్బుతో బాధపడుతున్నాడు. పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేస్తుండగా భయంతో రాజయ్యతో పాటు అక్కడినుంచి మరికొందరు పరుగులు తీశారు. మానేరు వాగు దాటి ఒడ్డుపైకి చేరే క్రమంలో అతనికి శ్వాస ఇబ్బందులు తలెత్తి కుప్పకూలిపోయాడు. అక్కడికెళ్లిన వారు సహాయం చేయడానికి ప్రయత్నించినప్పటికీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు తెలిసింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.