కేసీఆర్‌‌ ఒక్కడితోనే తెలంగాణ రాలే..కళాకారుల పాటలతోనే సాధ్యమైంది : ఎంపీ ఆర్.కృష్ణయ్య

కేసీఆర్‌‌ ఒక్కడితోనే తెలంగాణ రాలే..కళాకారుల పాటలతోనే సాధ్యమైంది : ఎంపీ ఆర్.కృష్ణయ్య

బషీర్‌‌బాగ్‌‌, వెలుగు : ‘తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ఒక్కడి వల్లే రాలేదు, కళాకారుల పాటలతోనే రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైంది, ఒక్క పాట వంద ఉపన్యాసాలతో సమానం’ అని ఎంపీ ఆర్‌‌.కృష్ణయ్య అన్నారు. బీసీ కళామండలి జాతీయ అధ్యక్షుడు రామలింగం అధ్యక్షతన శుక్రవారం హైదరాబాద్‌‌లోని బషీర్‌‌బాగ్‌‌ ప్రెస్‌‌క్లబ్‌‌లో జరిగిన ధూంధాం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కళాకారులను బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం విస్మరించిందన్నారు. కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సీఎం రేవంత్‌‌రెడ్డి చొరవ చూపాలని కోరారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ అరుణ్‌‌కుమార్‌‌, ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, అనంతయ్య, రాజేందర్, కిరణ్‌‌కుమార్‌‌, ఎన్‌‌.వెంకటేశ్‌‌ పాల్గొన్నారు.

ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌‌ విడుదల చేయాలి

‘మంత్రివర్గంలో బీసీలకు అన్యాయం జరిగింది.. కనీసం రాజ్యసభలో బీసీలకు చోటు కల్పించపోవడం దురదృష్టకరం’ అని ఎంపీ ఆర్‌‌.కృష్ణయ్య అన్నారు. పెండింగ్‌‌లో ఉన్న ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్‌‌ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌‌లో కలెక్టరేట్‌‌ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్‌‌.కృష్ణయ్య మాట్లాడుతూ.. కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులు చెల్లిస్తున్న ప్రభుత్వం... స్టూడెంట్ల రీయింబర్స్‌‌మెంట్‌‌ విడుదల చేయడానికి మీనమేషాలు లెక్కిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ ర్యాగ అరుణ్‌‌కుమార్‌‌,  విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిళ్ల సతీష్‌‌, ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అనంతయ్య, శివకుమార్‌‌యాదవ్‌‌, అంజిగౌడ్, నిఖిల్‌‌ పటేల్‌‌, చరణ్‌‌, వెంకటేశ్‌‌, యశ్వంత్‌‌ యాదవ్‌‌ పాల్గొన్నారు.