తెలంగాణపై యుద్దం ఎఫెక్ట్ :రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో యూరియా ఉత్పత్తి తగ్గింది

తెలంగాణపై యుద్దం ఎఫెక్ట్ :రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో యూరియా ఉత్పత్తి తగ్గింది
  • 15 శాతం తగ్గిన గ్యాస్‌‌ సప్లై..యూరియా ఉత్పత్తినీ తగ్గించిన మేనేజ్‌‌మెంట్‌‌

గోదావరిఖని, వెలుగు : ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్‌‌ మధ్య జరుగుతున్న యుద్ధం ఎఫెక్ట్‌‌ తెలంగాణ రాష్ట్రంలోని రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ (ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌)పై పడింది. నాచురల్‌‌ గ్యాస్‌‌ సప్లై తగ్గిపోవడంతో ఆ మేరకు యూరియా ఉత్పత్తిని సైతం తగ్గించారు. ఖతార్‌‌ నుంచి భారతదేశంలోని గుజరాత్‌‌కు, అక్కడి నుంచి కాకినాడ పోర్టుకు వచ్చే గ్యాస్‌‌ అక్కడి నుంచి పైప్‌‌లైన్ల ద్వారా ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌కు చేరుతుంది. ఎరువుల ఫ్యాక్టరీకి ప్రతి రోజు రెండు మిలియన్‌‌ మెట్రిక్‌‌ బ్రిటీష్‌‌ థర్మల్‌‌ యూనిట్ల ( ఎంఎంబీటీయూ) గ్యాస్‌‌ సప్లై అయ్యేది. కానీ యుద్ధం కారణంగా ఖతార్‌‌ నుంచి గ్యాస్‌‌ సప్లై కాకపోవడంతో రామగుండం ప్లాంట్‌‌కు 15 శాతం గ్యాస్‌‌ సప్లైని తగ్గించారు. మరో వైపు దేశంలో నాచురల్‌‌ గ్యాస్‌‌ నిల్వలు 25 రోజుల వరకు సరిపోయేలా ఉన్నందున దానిని సర్దుబాటు చేసుకునేందుకు కేంద్రం ప్లాన్‌‌ చేసింది. ఇందులో భాగంగా దేశంలోని 28 ఎరువుల ఫ్యాక్టరీలలో యూరియా ఉత్పత్తి పూర్తిగా పడిపోకుండా ఉండేందుకు 10 నుంచి 15 శాతం ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌లో కూడా 15 శాతం యూరియా ఉత్పత్తిని తగ్గించారు. వాస్తవానికి ఫ్యాక్టరీలో ఒక రోజు 3,850 టన్నుల యూరియా ఉత్పత్తి చేయాల్సి ఉండగా.. గత మూడు రోజులుగా 3,300 టన్నుల యూరియానే ఉత్పత్తి చేస్తున్నారు.