జ్యోతినగర్, వెలుగు: భద్రతను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలని ఎన్టీపీసీ ఆఫీసర్లు సూచించారు. 55వ జాతీయ భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఎన్టీపీసీ తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం 500 మంది ఉద్యోగులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్లాంట్ పరిధిలోని సురక్షా కేంద్రం వద్ద ప్రారంభమైన ర్యాలీ సర్వీస్ బిల్డింగ్ వరకు కొనసాగింది. అనంతరం మూడు భాషల్లో భద్రతా ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా జీఎం ముకుల్ రాయ్ మాట్లాడుతూ.. ప్లాంట్‌లో ప్రతి పనిలోనూ భద్రతకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వ్యక్తిగత రక్షణ పరికరాల(పీపీఈ) వినియోగం, వర్క్ పర్మిట్ నిబంధనల అమలులో ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించవద్దని సూచించారు. ప్రమాదకర పరిస్థితులకు ముందే గుర్తించి రిపోర్ట్ చేయడం ద్వారా జీరో హార్మ్ లక్ష్యాన్ని సాధించవచ్చని ధీమా వ్యక్తం చేశారు.
