- భూ వాతావరణం అంచుకు వెళ్లి.. భూమి మీద ఉన్న లక్ష్యంపై దాడి
- దీని పొడవు 6.5 మీటర్లు.. బరువు1.9 టన్నులు
టెహ్రాన్: ఇజ్రాయెల్– అమెరికా చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో ఇరాన్ సుప్రీం లీడర్‌అయతొల్లా అలీ ఖమేనీ (86) మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే, ఆయన మృత్యువు అంతరిక్షం నుంచి దూసుకొచ్చిందని పలు కథనాలు వెలువడ్డాయి. ఖమేనీని అంతం చేసేందుకు ఇజ్రాయెల్ స్పేస్‌నుంచి భూమి మీద ఉన్న లక్ష్యాన్ని ఢీకొట్టే ఎయిర్ లాంచ్డ్ బ్లూ స్పారో మిసైల్‌ను ఉపయోగించిందని పేర్కొన్నాయి. ఇరాన్ నాయకత్వమే లక్ష్యంగా ఇజ్రాయెల్‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ చేపట్టింది.
ఫిబ్రవరి 28న ఇరాన్ కాలమానం ప్రకారం.. ఉదయం 7:30 గంటలకు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బయలుదేరి, 2 గంటల తర్వాత ప్రయోగ స్థానాలకు చేరుకున్నాయి. ఉదయం 9:40 గంటలకు.. ఖమేనీ కాంపౌండ్, సమీపంలోని భవనాలపై దాడి చేసేందుకు బ్లూ స్పారో క్షిపణులతో సహా సుమారు 30 ప్రిసిషన్ -గైడెడ్ మందుగుండు సామగ్రిని ఇజ్రాయెల్ దళాలు ప్రయోగించాయి.
పాశ్చర్ స్ట్రీట్‌లోని ఖమేనీకి చెందిన కట్టుదిట్టమైన భద్రత కలిగిన కాంపౌండ్‌పై ఈ దాడి జరిగింది. ఆ సమయంలో పలువురు ఉన్నతాధికారులు అక్కడ సమావేశమై ఉన్నారు. ఈ క్షిపణి అనుకున్న లక్ష్యాన్ని ఢీకొట్టడంతో ఖమేనీ మృతిచెందారు.
స్పేస్‌నుంచి ప్రయాణించి.. టార్గెట్ రీచ్
బ్లూ స్పారో క్షిపణి ‘క్వాసీ -బాలిస్టిక్’ శ్రేణికి చెందింది. అంటే ఇది భూ వాతావరణం కంటే చాలా ఎత్తుకు చేరుకుని, అక్కడి నుంచి తన లక్ష్యం వైపు నిలువుగా కిందికి దూసుకొస్తుంది. ఇజ్రాయెల్ తన ‘స్పారో’ క్షిపణి శ్రేణిలో భాగంగా దీనిని అభివృద్ధి చేసింది. దీని పొడవు సుమారు 6.5 మీటర్లు.. బరువు 1.9 టన్నులు.. దీని పరిధి 2 వేల కిలోమీటర్లు. దీన్ని సాధారణంగా మెక్‌డొన్నెల్ డగ్లస్ ఎఫ్-15 ఈగిల్‌లాంటి ఫైటర్ జెట్ల నుంచి లాంచ్ చేస్తారు.
ప్రయోగించిన తర్వాత, ఒక బూస్టర్ రాకెట్ ఈ క్షిపణిని అంతరిక్షం అంచు వరకు తీసుకెళ్తుంది. ఆ తర్వాత అది విడిపోయి, వాతావరణంలోకి తిరిగి ప్రవేశించి అత్యంత వేగంతో లక్ష్యాన్ని తాకుతుంది. దీనిని అడ్డుకోవడం దాదాపు అసాధ్యం.
ఖమేనీ హత్యకు నవంబర్‌లోనే ప్లాన్ చేశాం
టెల్అవీవ్: ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని అంతం చేసే ప్రణాళికను గత నవంబర్‌లోనే సిద్ధం చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ వెల్లడించారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన ఉమ్మడి దాడుల్లో ఖమేనీతో పాటు పలువురు అగ్రశ్రేణి నాయకులు మరణించిన సంగతి తెలిసిందే.
అయితే, ఈ ఆపరేషన్‌కు సంబంధించిన ప్రాథమిక వ్యూహాన్ని ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, ఆయన సహచరులు గతేడాది నవంబర్‌లోనే ఖరారు చేశారని కాట్జ్ స్పష్టం చేశారు. ఇరాన్‌లో చెలరేగిన భారీ ప్రజా నిరసనల కారణంగానే ఈ దాడిని వాయిదా వేయాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
ఓ ఇంటర్వ్యూలో కాట్జ్ మాట్లాడుతూ.. నవంబర్ 2025లో నెతన్యాహు నేతృత్వంలో జరిగిన రహస్య సమావేశంలో ఖమేనీ హత్యపై చర్చలు జరిగినట్లు తెలిపారు. తొలుత ఈ ప్రణాళికను అమెరికాతో పంచుకోకూడదని నిర్ణయించుకున్నామని, అవసరమైతే సొంతంగానే ఈ ఆపరేషన్ పూర్తిచేయాలని భావించామన్నారు.
