పొలాల్లో ఇసుక మేటలను తొలగిస్తాం : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

పొలాల్లో ఇసుక మేటలను తొలగిస్తాం : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
  • .. రైతులకు లబ్ధి చేకూరుస్తాం : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ 
  • లింగంపేట మండలంలో పనులు పరిశీలించిన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్  

లింగంపేట, వెలుగు: గత నెలలో కురిసిన భారీ వర్షాలకు పొలాల్లో వేసిన ఇసుక మేటలను తొలగించి రైతులకు లబ్ధి చేకూరుస్తామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు.  లింగంపేట మండలం బూరుగిద్ద శివారులో సబావత్ లక్ష్మీ వరి పొలంలో​ఉపాధి కూలీలు చేపట్టిన ఇసుక మేటల తొలగింపు పనులను గురువారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ లింగంపేట మడలంలోని 41  జీపీలలో 287 ఎకరాల్లో ఇసుకమేటలు వేసినట్లు గుర్తించామని చెప్పారు.  ఇసుక మేటల వల్ల నష్టపోయిన బాధిత రైతులకు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు.  

పొలాల నుంచి తొలగించిన ఇసుకను ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఉపయోగించాలని స్థానిక ఎంపీడీఓ నరేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆదేశించారు.  ఇసుక మేటల తొలగింపు పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని డీఆర్డీఓ సురేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సూచించారు. వరదల వల్ల జరిగిన పంటనష్టం వివరాలను పూర్తి స్థాయిలో సేకరించాలని వ్యవసాయ అధికారులను కలెక్టర్​ ఆదేశించారు. 

తెగిన చెరువులకు మరమ్మతులు చేపడతాం 

అధిక వర్షాలతో  తెగిపోయిన ఊరకుంట చెరువు, సోమ్లానాయక్,  కొండెంగల, మల్లారంపెద్ద చెరువుతో పాటు జిల్లా వ్యాప్తంగా దెబ్బతిన్న అన్ని చెరువుల మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని ప్రతిరోజు ఇరిగేషన్​ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించేలా చర్యలు తీసుకోవాలనీ ఇరిగేషన్​ సీఈ శ్రీనివాస్​ను ఆదేశించారు.

పోషకాహారం విలువను తెలియజేయాలి

చిన్నారుల అమ్మ నాన్నలకు, బాలింతలకు, గర్బిణులకు, కిశోర బాలికలకు పోషకాహారం విలువను తెలియజేయాలని కలెక్టర్​ ఆశిష్​సంగ్వాన్​ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆఫీసర్లను ఆదేశించారు.  మండలంలోని పోతాయిపల్లి  గ్రామంలోని అంగన్​వాడీ కేంద్రంలో గురువారం నిర్వహించిన పోషన్ అభిమాన్ ను కలెక్టర్​ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ప్రతిరోజు పాలు, గుడ్లు ఆకుకూరలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిణి ప్రమీలకు సూచించారు.

అనంతరం గ్రామంలోని జడ్పీహైస్కూల్​లో నిర్వహించిన స్వఛ్చత హీసేవా  2025 పోషక్​ అభియాన్​ కార్యక్రమంలో కలెక్టర్​ పాల్గొన్నారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.  కలెక్టర్​ వెంట డీఆర్డీఓ సురేందర్​, జిల్లా బాలల సంరక్షణ అధికారి స్రవంతి, ఎల్లారెడ్డి ఆర్డీఓ పార్థసింహా రెడ్డి,ఎంపీడీఓ నరేశ్, తహసీల్దార్ సురేశ్, ఏఓ అనిల్​కుమార్​, ఈజీఎస్​ ఏపీవో నరేందర్​ తదితరులు ఉన్నారు.