ములుకనూర్ సహకార సొసైటీ.. అభివృద్ధికి మార్గదర్శి

ములుకనూర్ సహకార సొసైటీ.. అభివృద్ధికి మార్గదర్శి
  • నేడు 69వ వార్షిక మహాసభ 

భీమదేవరపల్లి, వెలుగు : ములుకనూర్ సహకార సొసైటీ అభివృద్ధికి మార్గదర్శిగా నిలుస్తోంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూర్ గ్రామానికి చెందిన దార్శనికుడు అలిగిరెడ్డి విశ్వనాథరెడ్డి 1956లో 373 మంది రైతులు, 2,300 వాటాధనంతో ములుకనూర్​సొసైటీ పురుడు పోసుకుంది. తొలి రోజు నుంచే సొసైటీ పారదర్శకంగా వ్యవహరిస్తూ క్రమశిక్షణ, నాణ్యత, నమ్మకం అనే నినాదాలతో సభ్యత్వాన్ని విస్తరింపజేసుకుంటూ ముందుకు సాగుతోంది. 

ప్రస్తుతం 7540 మంది రైతులతో 407 కోట్ల వ్యాపారం చేసే స్థాయికి ఎదిగింది. వ్యవసాయ అవసరాలకు మాత్రమే కాకుండా విద్య, వైద్యం ఇతర సామాజిక సేవలకు కూడా నిధులు సమకూరుస్తుంది. సభ్యులకు తక్కువ వడ్డీకి రుణాలు అందించి సకాలంలో వంద శాతం రికవరీ చేపట్టడమే సంస్థ ఎదుగుదలకు కారణమయ్యింది. 

సభ్యుడి కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వారి పిల్లలకు స్కాలర్​షిప్, విద్య రుణాలతోపాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపేలా ఉచిత వైద్య సేవలతోపాటు పెన్షన్​ సౌకర్యాన్ని కల్పిస్తోంది. సభ్యులు లేదా వారి భార్యలు మరణిస్తే అంత్యక్రియలకు ఆర్థిక సాయం ఏటేటా పెంచుతూ వస్తోంది. ఏటా రైతులకు ఆధునిక వ్యవసాయంలో శిక్షణ ఇస్తూ మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన వ్యవవసాయ విధానాలు నేర్పుతుంది. 

నేడే 69వ సొసైటీ వార్షిక మహాసభ..

ములుకనూర్ సహకార గ్రామీణ పరపతి మరియు మార్కెటింగ్​సొసైటీ లిమిటెడ్ 69వ వార్షిక మహాసభ నేడు సంఘ పార్​బాయిల్డ్ రైస్ మిల్లు ఆవరణలో నిర్వహించనున్నట్లు జీఎం రాంరెడ్డి తెలిపారు. గతేడాది ఆదాయ, వ్యయాలు, అభివృద్ధి కార్యక్రమాలు, కొత్త పథకాలను సమగ్రంగా వివరిస్తూ.. ఈ ఏడాది వ్యాపారంలో వచ్చిన లాభాలను బోనస్​రూపంలో రైతులకు అందిస్తామని వివరించారు. 

రైతుల అభివృద్ధే మా లక్ష్యం..

రైతుల అభివృద్ధే మా లక్ష్యం. సభ్యుల విశ్వాసంతో ముందడుగు వేస్తున్నాం. మరింత పారదర్శకతతో శాశ్వత అభివృద్ధికి కృషి చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక స్వయం సమృద్ధిని పెంచడం, రైతులకు సరసమైన రుణాలు, ఎరువులు, విత్తనాలు అందిస్తాం. మహిళల స్వయం సహాయక సంఘాలకు ప్రోత్సాహం అందిస్తున్నాం. ‌‌ - సొసైటీ అధ్యక్షుడు ప్రవీణ్​రెడ్డి