- ‘ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ’లో అరుదైన ఆపరేషన్
- ఓ మహిళకు12 ఏండ్లుగా మూత్ర విసర్జన సమస్యతో నరకం
- ప్రతిసారీ యూరిన్ పాస్ చేసేందుకు15 నుంచి 20 నిమిషాల టైం
- మూత్రనాళాలు సన్నబడటమే కారణం
- నోటి లోపలి కణజాలంతో పునర్నిర్మాణం చేసిన డాక్టర్లు
హైదరాబాద్, వెలుగు: పన్నెండేండ్లుగా మూత్ర విసర్జన సమస్యతో నరకం అనుభవిస్తున్న ఓ మహిళకు హైదరాబాద్ లోని ఏసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ(ఏఐఏఎన్ యూ) డాక్టర్లు అరుదైన సర్జరీ ద్వారా చెక్ పెట్టారు. నోటి (బుగ్గ) లోపలి పొర కణజాలాన్ని ఉపయోగించి చేసిన బకల్ మ్యూకోసల్ గ్రాఫ్ట్ యూరెత్రోప్లాస్టీ సర్జరీ విజయవంతం కావడంతో ఆ మహిళకు మళ్లీ మూత్ర విసర్జన సాధారణ స్థాయికి వచ్చిందని డాక్టర్లు వెల్లడించారు.
జార్ఖండ్‌కు చెందిన పల్లవి అనే మహిళ పన్నెండేండ్లుగా తీవ్రమైన మూత్ర సమస్యతో బాధపడుతున్నది. ప్రతిసారీ మూత్ర విసర్జన కోసం15 నుంచి 20 నిమిషాల సమయం పట్టేది. మూత్రం చుక్కలు చుక్కలుగా రావడం, నొప్పి, మంట, తరచూ ఇన్ఫెక్షన్లు రావడం ఆమెను కుంగదీశాయి. ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగినా తాత్కాలిక ఉపశమనమే తప్ప, సమస్య పూర్తిగా తగ్గలేదు.
అపోహలు వద్దు.. డాక్టర్ ను కలవాలి
మహిళల్లో యూరెత్రల్ స్ట్రిక్చర్ అనేది పెద్ద సమస్యగా గుర్తించకపోవడం వల్లే చాలామంది ఏళ్ల తరబడి బాధపడుతున్నారని డాక్టర్ భవతేజ్ ఎంగంటి అన్నారు. 40 ఏళ్లు పైబడిన మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుందని, సిజేరియన్ లేదా ఇతర సర్జరీల సమయంలో క్యాథెటర్ వాడకం, ఇన్ఫెక్షన్ల వల్ల ఈ పరిస్థితి రావొచ్చన్నారు. మూత్ర విసర్జనలో ఇబ్బంది ఉంటే సిగ్గుపడకుండా వెంటనే నిపుణులైన డాక్టర్లను సంప్రదించాలని సూచించారు. గత ఐదేళ్లలో ఏఐఎన్‌యూలో ఇలాంటి 60 సర్జరీలను విజయవంతంగా చేశామన్నారు.
డాక్టర్ సారికా పాండ్యా మాట్లాడుతూ.. చాలామంది మహిళలు మూత్రనాళం సన్నబడినప్పుడు ‘యూరెత్రల్ డైలేషన్(మూత్రనాళాన్ని వెడల్పు చేయడం)’ చేయించుకుంటారని, ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తుందని చెప్పారు. దీనిని పదే పదే చేయించుకోవడం వల్ల మూత్రనాళం మరింత దెబ్బతిని సమస్య జఠిలం అవుతుందన్నారు. పురుషుల్లో ఎక్కువగా చేసే బకల్ మ్యూకోసల్ గ్రాఫ్ట్ సర్జరీని ఇప్పుడు మహిళల్లోనూ విజయవంతంగా చేస్తున్నామని, ఇది శాశ్వత పరిష్కారమని వివరించారు.
నోటి లోపలి పొరతో పునర్నిర్మాణం..
చివరగా ఆమె బంజారాహిల్స్‌లోని ఏఐఎన్‌యూ ఆసుపత్రికి వచ్చింది. ఏఐఎన్‌యూ కన్సల్టెంట్ ఫీమేల్ యూరాలజిస్ట్ డాక్టర్ సారికా పాండ్యా, రీకన్ స్ట్రక్టివ్ యూరాలజీ విభాగం హెడ్ డాక్టర్ భవతేజ్ ఎంగంటి ఆధ్వర్యంలో పల్లవికి పరీక్షలు నిర్వహించారు. ఆమె ఫీమేల్ యూరెత్రల్ స్ట్రిక్చర్ (మూత్రనాళం సన్నబడటం) సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు.
దీనికి పరిష్కారంగా నోటి లోపలి పొర (బకల్ మ్యూకోసా) నుంచి సేకరించిన కణజాలంతో మూత్రనాళాన్ని పునర్నిర్మించే అరుదైన ఆపరేషన్ చేశారు. సర్జరీ జరిగిన నాలుగు నెలల్లోనే ఆమె పూర్తిగా కోలుకున్నదని, మూత్ర విసర్జన సమస్య పూర్తిగా తొలగిపోయిందని డాక్టర్లు తెలిపారు.
