ఒకవైపు తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి పండుగ వేడుకల్లో మునిగిన వేళ.. రెండు కుటుంబాలు మాత్రం తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. బుధవారం (జనవరి 14) నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో బావిలో ఇద్దరు బాలికల మృతదేహాలు లభ్యం కావడం కలకలం రేపింది.
మొల్లచింతలపల్లి కి చెందిన లావణ్య (14 ), కొల్లాపూర్ కు చెందిన వరలక్ష్మి (19) అనే ఇద్దరి మృతదేహలు బావిలో లభ్యం కావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. రెండురోజుల క్రితం కొల్లాపూర్ లో అదృశ్యమైన ఇద్దరు బాలికలు బావిలో శవాలుగా తేలడం సంచలనంగా మారింది.
బాలికలు అదృశ్యం కావడంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలికల కుటుంబ సభ్యులు. మొల్లచింతలపల్లిలో శవాలుగా తేలడంతో కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
