- నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : నాగర్ కర్నూల్ జిల్లాలోని చెంచు పెంటల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ సర్వేను స్పీడప్ చేయాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఐటీడీఏ, గృహ నిర్మాణ శాఖ, ఆర్డీటీ సంస్థ ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఆర్థిక స్తోమత లేని చెంచు ప్రజల కోసం ఆర్డీటీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ఇండ్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున ఐటీడీఏ ద్వారా నేరుగా నిర్మాణ సంస్థకు చెల్లింపులు జరిగేలా ఎంఓయూ చేసుకోవాలని సూచించారు.
ఐదు జిల్లాల పరిధిలో మొత్తం 1,488 ఇండ్లు మంజూరు కాగా, నాగర్ కర్నూల్ జిల్లాలో 536 ఇండ్లు మంజూరయ్యాయని, వీటిని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే, 42 అంశాలతో కూడిన క్షేత్రస్థాయి సర్వే ద్వారా ప్రతి లబ్ధిదారుడికి ఆధార్, రేషన్ కార్డు, ఆయుష్మాన్ భారత్, జన్ మన్ కార్డ్ లాంటి అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా గృహ నిర్మాణ సంస్థ పీడీ సంగప్ప, ఐటీడీఏ మేనేజర్ జాఫర్ హుస్సేన్, ఆర్డీటీ సంస్థ హ్యాబిటేషన్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, భవ్య నారాయణ, నాగరాజు, రామ్మోహన్, రాధ పాల్గొన్నారు.
గ్రామ ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత సర్పంచులదే..
గ్రామ స్థాయి అభివృద్ధిలో సర్పంచులు కీలక పాత్ర పోషించాలని, గ్రామ ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత వారిపైనే ఉందని కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. అచ్చంపేట డివిజన్ పరిధిలోని 137 గ్రామాల నూతన సర్పంచులకు నిర్వహించిన 3వ విడత శిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన అధికారంతో ప్రజల అభ్యున్నతికి రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని, మహిళా సర్పంచులు తమ పరిపాలనలో కుటుంబ సభ్యుల జోక్యం లేకుండా నాయకత్వ పటిమను ప్రదర్శించాలని సూచించారు.
తాగునీరు, పారిశుధ్యం, విద్య, వైద్యం లాంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ, సర్పంచ్ పదవిని ప్రజాసేవకు పునాదిగా భావించి నిబద్ధతతో పనిచేస్తే భవిష్యత్లో ఉన్నత రాజకీయ అవకాశాలు లభిస్తాయని, పారదర్శక పాలనతో ప్రజల విశ్వాసాన్ని పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ రాజేందర్, అడిషన్ కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం, జిల్లా పంచాయతీ అధికారి శ్రీరాములు, డిప్యూటీ సీఈఓ గోపాల్ నాయక్ పాల్గొన్నారు.
