మక్తల్, వెలుగు : ఎన్నో అవమానాలను భరించి రాజకీయాల్లోకి వచ్చానని, మక్తల్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం మాగనూర్ మండలం వడ్వాట్, ఊట్కూర్ మండలం పులిమామిడి గ్రామాల్లో రూ. 2.90 కోట్లతో నిర్మించనున్న 33/11 కేవీ నూతన విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం గురురావు లింగంపల్లిలో అంగన్‌వాడీ భవన నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ గత 72 ఏండ్లలో 14 మంది ఎమ్మెల్యేలు ఈ ప్రాంతానికి కేవలం రూ. 296 కోట్లు మాత్రమే తీసుకువస్తే, తాను ఎమ్మెల్యేగా గెలిచిన ఈ రెండేండ్లలోనే రూ. 1035 కోట్ల అభివృద్ధి పనులను మంజూరు చేయించి రికార్డు సృష్టించానని తెలిపారు. ప్రతిపక్షాలు తనపై ఎన్ని అభాండాలు వేసినా, తప్పుడు ప్రచారాలు చేసినా మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో వారందరికీ తగిన బుద్ధి వచ్చిందని పేర్కొన్నారు. అభివృద్ధిని అడ్డుకునే శక్తులను దాటుకొని ముందుకు వెళ్తున్నామని, తనను చంపేందుకు కుట్రలు చేసినా భయపడే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు.
మరణాన్ని దేవుడు నిర్ణయిస్తాడని, చావుకు భయపడి వెనకడుగు వేసే వ్యక్తిని కాదన్నారు. నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తానని, విద్య, సాగునీరు రంగాల్లో ఈ ప్రాంతాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. చదువు ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారమని, యువత విద్యావంతులుగా ఎదిగి తమ భవిష్యత్‌ను తామే నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, వారికి నాణ్యమైన విద్యుత్ అందించడం కోసమే ఈ సబ్ స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏడీ గంగాధర్, మాజీ జడ్పీటీసీ లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
