సింగర్ జుబిన్ గార్గ్‎ది హత్య కాదు.. మద్యం మత్తులో చనిపోయిండు: సింగపూర్ పోలీసులు

సింగర్ జుబిన్ గార్గ్‎ది హత్య కాదు.. మద్యం మత్తులో చనిపోయిండు: సింగపూర్ పోలీసులు

న్యూఢిల్లీ: సింగపూర్‎లో అనుమానస్పద రీతిలో మృతి చెందిన ప్రముఖ అస్సామీ సింగర్ జుబిన్ గార్గ్ మరణంపై సింగపూర్ పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. జుబిన్ గార్గ్‎ది హత్య కాదని.. మద్యం మత్తులో ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి చనిపోయాడని తెలిపారు. ఈ మేరకు సింగపూర్ పోలీసులు కోర్టుకు నివేదిక సమర్పించారు. మద్యం మత్తులో లైఫ్ జాకెట్ లేకుండా నీటిలోకి దిగి మునిగి చనిపోయాడని పేర్కొన్నారు. 

‘‘ప్రమాదం జరిగిన రోజు జుబిన్ గార్గ్ మద్యం మత్తులో ఉన్నాడు. అతను మొదట లైఫ్ జాకెట్ ధరించి నీటిలోకి దిగాడు. కానీ రెండో సారి లైఫ్ జాకెట్ లేకుండానే ఊత కొట్టేందుకు నీళ్లలోకి వెళ్లాడు. ఈ క్రమంలో ఊపిరి ఆడకపోవడంతో పడవ దగ్గరికి వచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

 పోస్ట్ మార్టం రిపోర్టులో కూడా గార్గ్ నీటిలో మునిగి చనిపోయాడని నిర్ధారణ అయ్యింది. అతడి శరీరంపై కొన్ని గాయాలు కనిపించాయి కానీ అవి సీపీఆర్, రెస్క్యూ సమయంలో తగిలాయని తేలింది. గార్గ్ మరణంలో ఎటువంటి క్రిమినల్ నేరం లేదు. అతడిది హత్య కాదు.. మద్యం మత్తులో నీటిలో మునిగి ప్రమాదవశాత్తూ చనిపోయాడు’’ అని కోర్టుకు సమర్పించిన నివేదికలో సింగపూర్ పోలీసులు స్పష్టం చేశారు.

అస్సాంకు చెందిన ప్రముఖ బాలీవుడ్ సింగర్ జుబీన్ గార్గ్ 2025, సెప్టెంబర్ 19న సింగపూర్‌లో స్కూబా డైవింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు సముద్రంలో పడి మరణించిన  విషయం తెలిసిందే. జుబీన్ సముద్రంలో పడిన వెంటనే, సింగపూర్ పోలీసులు అతన్ని రక్షించి CPR చేసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ, వైద్యులు అతన్ని రక్షించలేకపోయారు. అయితే, జుబిన్ మరణంపై పలు అనుమానాలు రేకెత్తడంతో అస్సాం ప్రభుత్వ విచారణకు ఆదేశించింది.

జుబిన్ గార్గ్ డెత్ కేసు విచారణను సిట్‎కు అప్పగించింది. గార్గ్ మరణంపై విచారణ చేపట్టిన సిట్ పలువురు అనుమానితులను విచారించి ఏడుగురిని అరెస్ట్ చేసింది. జుబిన్ గార్గ్ హత్యకు గురయ్యాడని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ జుబిన్ గార్గ్ ది హత్య కాదని.. ప్రమాదవశాత్తూ మరణించాడని సింగపూర్ పోలీసులు పేర్కొన్నారు.